
- సుప్రీంకోర్టులో తెలంగాణ వాదనలు
- ట్రిబ్యునల్ వాటాల పంపిణీపైనే పర్యవేక్షించాలి
- బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించేది లేదని స్పష్టం
- 2021, 2022లో కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్లపై ఇంటరిం రిలీఫ్ ఇవ్వాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాల మధ్య నీటివాటాలను పంపిణీ చేసే అధికారం రివర్ బోర్డులకు లేదని సుప్రీంకోర్టుకు తెలంగాణ తేల్చి చెప్పింది. ట్రిబ్యునల్ పంపిణీ చేసే వాటాలను కేవలం పర్యవేక్షించే అధికారమే బోర్డులకు ఉంటుందని స్పష్టం చేసింది. నీటి వాటాల పంపిణీ తేలే వరకు ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేది లేదని పేర్కొంది. ఇప్పటికే ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి చేసిన జలవిద్యుదుత్పత్తి చేసుకునేలా తెలంగాణ సర్కారు ఇచ్చిన జీవో 34పై ఏపీ, విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుల నిర్వహణను బోర్డులకు అప్పగిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్ పై తెలంగాణ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఆ రెండు పిటిషన్లను కలిపి జస్టిస్ ఓకా ధర్మాసనం విచారించింది. ప్రస్తుతం కృష్ణా బేసిన్లో గంపగుత్త జలాల్లో రెండు రాష్ట్రాలకు వాటాల కేటాయింపుపై ట్రిబ్యునల్ విచారణ జరుగుతున్నదని, నీటి కేటాయింపులు లేకుండా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించడం సాధ్యం కాదని తెలంగాణ వాదించింది. తెలంగాణకు నీటి వాటాల్లో అన్యాయం జరుగుతున్నదని, దీనిపై కేంద్రానికి విజ్ఞ ప్తి చేశాకే సెక్షన్ 3లోని ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్కు కేంద్రం ఆమోదం తెలిపిందని, దీంతో ట్రిబ్యునల్లో దానిపైనే వాదనలు జరుగుతున్నాయని స్పష్టం చేసింది. ఇలాంటి సమయంలో బోర్డుకు ప్రాజెక్టులను అప్పగిస్తే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొంది.
కాబట్టి 2021, 2022లలో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్లపై ఇంటరిం రిలీఫ్ ఇవ్వాలని కోరింది. ఇటు ఏపీ కూడా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించాలని వాదించింది. శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తిని నిలిపేయాలని, అలా వాడుకునే నీళ్లను ఆ రాష్ట్ర కోటాలో కలపాలంటూ మొండి వాదనలు చేసింది. అయితే, కేసును మరింత లోతుగా విచారించేందుకుగానూ వాదనలను జులై 28కి కోర్టు వాయిదా వేసింది. కాగా, సెక్షన్ 3లోని ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతుండడంపై ఏపీ వేసిన పిటిషన్పై గురువారం జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారించనుంది.