అన్ని పార్టీలను సమానంగా చూస్తం : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్

అన్ని పార్టీలను సమానంగా చూస్తం : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్
  • అన్ని పార్టీలను సమానంగా చూస్తం
  • రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్
  • రాజకీయ పార్టీలతో భేటీ
  • సోషల్ మీడియాలో నిరాధార విమర్శలను కట్టడి చేయాలి: బీఆర్ఎస్
  • ప్రగతి భవన్‌‌లో పార్టీ బీఫామ్స్ ఇవ్వడమేంది?: కాంగ్రెస్

హైదరాబాద్, వెలుగు : అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ చెప్పారు. శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సహకారాన్ని అందజేస్తామని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సోషల్ మీడియాతో సహా ఏ అంశం పైన అయినా చేసే సహేతుకమైన ప్రతి ఫిర్యాదును సానుకూలంగా పరిశీలిస్తామని అన్నారు. మంగళవారం బీఆర్కే భవన్‌‌లో అన్ని రాజకీయ పార్టీలతో వికాస్ రాజ్ సమావేశమయ్యారు. 

తర్వాత నేతలు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు రూల్స్‌‌పై క్లారిటీ లేదని కాంగ్రెస్ నేత నిరంజన్ విమర్శించారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు ఎవరు అనుమతి ఇవ్వాలో ఈసీ క్లారిటీ ఇవ్వాలని కోరారు. ‘‘ప్రగతి భవన్‌‌లో పార్టీ బీఫామ్స్ ఇవ్వకూడదు. అది పబ్లిక్ ప్రాపర్టీ’’ అని కాంగ్రెస్ లీడర్లు తెలిపారు. ప్రగతి భవన్ లో బీఫామ్స్ ఇవ్వడంపై ఈసీకి ఫిర్యాదు చేశామని, దీంతోనే విచారణకు ఈసీ ఆదేశించిందని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఎలక్షన్‌‌కు సంబంధం లేని విమర్శలు చేయకూడదని ఈసీని కోరినట్లు బీఆర్ఎస్ నేత సోమ భరత్ తెలిపారు. సోషల్ మీడియాలో నిరాధారమైన వ్యక్తిగత విమర్శలు కట్టడి చేయాలని చెప్పామన్నారు.  కోరారు. 

సోషల్ మీడియా వేదికగా అన్ సోషల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలింగ్ స్టేషన్‌‌లో లైటింగ్ అరేంజ్ చేయాలని అడిగామన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులను బదిలీ చేయాలని బీజేపీ కోరింది.  బోగస్ ఓట్లు, అక్రమ డబ్బు తరలింపు పై ఫోకస్ పెట్టాలని కోరినట్లు టీటీడీపీ నేత సతీష్ చెప్పారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులపై ఫిర్యాదు చేసినట్లు బీఎస్పీ లీడర్ దయానంద్ రావు తెలిపారు. బోగస్ ఓట్లపై క్లారిటీ ఇవ్వాలని కోరినట్లు సీపీఎం లీడర్లు నరసింహ రావు తెలిపారు. లిక్కర్‌‌‌‌ను బ్యాన్ చేయాలని కోరినట్లు ఆప్ నేతలు చెప్పారు. బ్యాలెట్ ఓట్లు పెట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు ప్రజాశాంతి పార్టీ నేతలు తెలిపారు.

అక్టోబర్ చివరి నాటికి ఓటరు కార్డులు

ఈ ఏడాది జనవరి 5వ తేదీ నుంచి 27.5 లక్షలకు పైగా ఓటరు కార్డులను ముద్రించి పంపిణీ చేశామని, ఈ నెలాఖరులోగా మిగిలిన కార్డుల ముద్రణ పూర్తి చేసి ఓటర్లకు అందజేస్తామని జాయింట్ సీఈవో తెలిపారు. ఓటర్లు కూడా సొంతంగా ఈ-ఎపిక్ కార్డులను ఓటర్ల సేవా పోర్టల్ నుంచి డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకునే కొత్త ఓటర్ల నమోదుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉందని వెల్లడించారు.