పది రోజుల్లో 1.06 లక్షల ఫైళ్లు క్లియర్..ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక నివేదికలో వెల్లడి

పది రోజుల్లో 1.06 లక్షల ఫైళ్లు క్లియర్..ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక నివేదికలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ సత్ఫలితాలను ఇస్తోంది. ఈ డ్రైవ్ ప్రారంభమైన తొలి పది రోజుల్లోనే(మార్చి 6 నుంచి15 వరకు) రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో పెండింగ్‌‌ ఉన్న 1,06,598 ఫైళ్లను క్లియర్ చేసినట్లు అధికారులు ఇచ్చిన నివేదికలో వెల్లడైంది. పారిశుధ్య కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ నిర్వహించిన శానిటేషన్ డ్రైవ్‌‌లో 455 టన్నుల వ్యర్థాలను తొలగించారు. గ్రామస్థాయి నుంచి సెక్రటేరియట్ వరకు 1.85 లక్షల ఆఫీస్​గదులను శుభ్రం చేయగా.. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు కలిపి దాదాపు 21 లక్షల మంది భాగస్వాములయ్యారు. 

రైతుల ఖాతాల్లో ఒకేరోజు రూ.3,500 కోట్లు జమ

సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. ఎకరాకు రూ.6 వేల చొప్పున ఒకేరోజు రూ.3,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకు రైతు మేళాలు నిర్వహించడంతోపాటు రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రభుత్వం ప్రారంభించింది. అలాగే, గజ్వేల్‌‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, హైదరాబాద్‌‌లో ఎకో హిల్ పార్క్, వివిధ జిల్లాల్లో మెడికల్ స్టోర్లు, ఆస్పత్రుల భవనాలు, రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 

జూన్ 2 రాష్ట్ర అవతరణ వేడుకల నాటికి పెండింగ్‌‌ అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినేట్​సబ్-కమిటీ ఆయా పనులను నిరంతరం పర్యవేక్షిస్తుండగా.. సీఎస్ రామకృష్ణారావు ప్రత్యేక డ్యాష్‌‌బోర్డు ద్వారా పురోగతిని సమీక్షిస్తున్నారు. మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో శానిటేషన్ డ్రైవ్‌‌, ఇందిరమ్మ గృహ ప్రవేశాలు, ప్రజాప్రతినిధుల శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.