
- గ్రూప్-1 విజేతలకు నియామక పత్రాలు అందజేత
- 5 కోట్లు తీస్కొని ఉద్యోగాలు అమ్ముకున్నమని కొందరన్నరు
- గుండెల మీద చెయ్యేస్కొని చెప్పండి.. నేనెవరితోనైనా చాయ్ అయినా తాగిన్నా?
- ఎన్నికల ఫలితాల కంటే.. నియామకాలపైనే ఎక్కువ ఆందోళన చెందా.. తెలంగాణ మోడల్, భవిష్యత్తు మీరే
- టీజీపీఎస్సీని గత ప్రభుత్వం అంగడి సరుకుగా మార్చిందని ఫైర్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే.. జీతంలో 10 శాతం కోత విధిస్తామని, ఆ మొత్తాన్ని వారి పేరెంట్స్ ఖాతాల్లో వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం త్వరలోనే ఒక చట్టం తీసుకువస్తామని చెప్పారు. శనివారం శిల్పకళా వేదికలో నిర్వహించిన కొలువుల పండుగలో భాగంగా గ్రూప్-1 విజేతలకు సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘మీ భవిష్యత్తు కోసమే సర్వం ఒడ్డి, మీకోసమే సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టి చూసుకోవాలి. వారిని భుజాల మీద మోయాల్సిన బాధ్యత మీదే. ఎవరైనా ఎక్కడైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశారని నా దృష్టికి వస్తే.. తప్పకుండా జీతంలో కోతపెట్టి.. ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు ఇస్తాం” అని తెలిపారు.
తెలంగాణ తెచ్చుకున్నది కుటుంబ సభ్యుల కోసం కాదని, కాలం కలిసి వచ్చి రెండుసార్లు గెలిస్తే ఆ గెలుపును చూసుకొని కారణజన్ములుగా భావించారని బీఆర్ఎస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను అంగడి సరుకుగా, రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చిందని మండిపడ్డారు. టీజీపీఎస్సీ లాంటి స్వతంత్ర సంస్థలు తెలంగాణ పునర్నిర్మాణం చేసేవని తెలిపారు. అధికారంలో వచ్చాక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి, పరీక్షలు పారదర్శకంగా నిర్వహించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కానీ ఇది కొంతమందికి నచ్చలేదన్నారు. వారికి తమ కుటుంబ సభ్యుల అభ్యున్నతే ముఖ్యం తప్ప.. ఇతరుల బాగు గురించి, నిరుద్యోగుల భవిష్యత్తు గురించి ఆలోచన లేదని విమర్శించారు.
ఉద్యోగ నియామకాలు అడ్డుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారని, కడుపు నిండా విషం పెట్టుకొని, మిమ్మల్ని దెబ్బ తీయాలని కుట్ర చేశారని చెప్పారు. ‘‘ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో అన్ని రకాలుగా చేసిండ్రు. కానీ, నేను, నా మంత్రివర్గ సహచరులు ఈ కార్యక్రమాన్ని నిజాయితీతో, ఒక మంచి సంకల్పంతో చేపట్టాం. రెండు, మూడు, ఐదు కోట్లు తీసుకొని ‘రేవంత్‌రెడ్డి ఉద్యోగాలు అమ్ముకున్నడు’ అని కొందరు అన్నరు. నేను ఇక్కడ ఎంపికైన ఈ 562 మందిని అడుగుతున్నా... గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి, ఎవరితోనైనా నేను ఒక్క ఛాయ్ అయినా తాగానా? మీకోసం నేను కొట్లాడాను. 2023 డిసెంబర్ 3నాడు నా ఎన్నికల ఫలితాల రోజు కూడా ఇంత ఆందోళనగా లేను. ఏది జరగాల్సి ఉంటే అది జరుగుతుందని భావించా. కానీ, మీ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతో, ఏకాగ్రతతో మీ భవిష్యత్తు కోసం కొట్లాడాను. ఎందుకంటే, మీ భవిష్యత్తే మన భవిష్యత్తు. మన భవిష్యత్తే మన తెలంగాణ భవిష్యత్తు” అని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని కేసులు వేసినా.. ఎన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేసినా.. వాటన్నింటిని కూడా ఓపికగా దిగమింగుకున్నామని చెప్పారు. ‘‘మీ భవిష్యత్తు, మీ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలనేదే మా లక్ష్యం. మారుమూల గూడేలు, పల్లెల్లో ఉపాధి హామీ కూలికి పోయి, రూపాయి రూపాయి కూడబెట్టి, ఆ డబ్బుతో కోచింగ్ సెంటర్లలో మిమ్మల్ని చదివించారు. ఆ త్యాగానికి న్యాయం చేద్దాం” అని అన్నారు.
ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్లను టీజీపీఎస్సీల్లో నియమించినం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను గత ప్రభుత్వం అంగడి సరుకుగా మార్చిందని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. యాదయ్యలాంటి స్టూడెంట్లు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని ‘జై తెలంగాణ’ అని నినదిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కల్వకుంట్ల కుటుంబ ప్రయోజనాల కోసం కాదని అన్నారు. ఆ త్యాగాల విలువను నిలబెట్టాలని అన్నారు. గ్రూప్–1 ఆఫీసర్లను నియమించే బాధ్యత ఉన్న కమిషన్‌లో గత బీఆర్ఎస్ సర్కారు ఆర్‌ఎంపీ డాక్టర్లను సభ్యులుగా నియమించిందని మండిపడ్డారు.
అందుకే ఆనాడు వాళ్లు నిర్వహించిన పరీక్షలు, ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లీబఠానీల్లాగా అమ్ముడుపోయాయని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే.. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని, రిటైర్డ్ డీజీపీ మహేందర్‌రెడ్డిని చైర్మన్‌గా నియమించామని చెప్పారు. జేఎన్‌యూ రిజిస్ట్రార్‌ను, ఒక ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్‌ను, ఒక గ్రేడ్ వన్ మున్సిపల్ కమిషనర్‌ను, ఐఏఎస్‌లను, ఐపీఎస్‌లను, ఒక యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌ను ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సభ్యులుగా నియమించామని వెల్లడించారు.
కోచింగ్ సెంటర్ల కుట్ర అర్థం చేసుకోవాలె..
ఉద్యోగ నియామకాలు ఆగిపోయేలా కేసులు వేస్తున్న కోచింగ్ సెంటర్ల కుట్రను కూడా అర్థం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ఉద్యోగాల కోసం మీరు ఏండ్లుగా చేస్తున్న శ్రమ.. వారికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే వ్యాపారంగా మారింది. ఈ రోజు ఉద్యోగ నియామకాలపై కేసులు వేస్తున్న వారి వెనకాల ఉన్న న్యాయవాదులు ఎవరో చూడండి. లక్షలు, కోట్ల రూపాయల ఫీజులు ఇచ్చి ఎవరు వాదిస్తున్నారో ఆలోచించండి. ఏది ఏమైనా, ఎవరు ఏమనుకున్నా తెలంగాణ భవిష్యత్తును నిర్మించే అవకాశం మీ చేతిలో ఉంది. ఈరోజు మిమ్మల్ని చూసి నవ్వినవాడి ముందు తలదించుకునే పని చేయకండి. ఇది గొప్ప అవకాశం.
గత 40 ఏండ్లలో 562 గ్రూప్ –1 ఉద్యోగ నియామకాలు జరగలేదు. 2011లో నోటిఫికేషన్ ఇస్తే 2018లో నియామకాలు జరిగాయి. అంటే ఏడేండ్లు పట్టింది. కానీ, మొట్టమొదటిసారిగా..ఈ ప్రభుత్వం కేవలం 19 నెలల్లోనే నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు బాధ్యతతో వ్యవహరించింది. ఈ రోజు రాష్ట్రం ఒక గొప్ప లక్ష్యంతో ముందుకెళ్తున్నది. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని సాధించాలనే లక్ష్యం ఉంది. ప్రస్తుతం దేశ జనాభాలో మనం 2.5% ఉన్నాం. దేశ జీడీపీకి మనం 5% ఇస్తున్నాం. కానీ, భవిష్యత్తులో మనం దేశ జీడీపీకి 10% కంట్రిబ్యూట్ చేయాలనేదే మన లక్ష్యం’’ అని పేర్కొన్నారు.
తెలంగాణ మోడల్అనేలా పని చేయాలి
మహారాష్ట్ర, గుజరాత్ మోడల్ కాదు.. తెలంగాణ మోడల్ సృష్టించాలి అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని గ్రూప్1 విజేతలకు సూచించారు. 2047 లోపు ఈ దేశంతోనే కాదు.. ప్రపంచంలో ఉండే గొప్ప నగరాలతో పోటీపడేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని అన్నారు. ‘‘రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సిమిలారిటీ ఉంది. ప్రభుత్వ ఉద్యోగంలోగానీ, రాజకీయాల్లోగానీ చేరినప్పుడు చాలా గరం గరం ఉంటారంట. కొంతకాలం అయినంక కొంచెం నరం నరం అవుతారంట. ఇంకొంత కాలానికి బేషరం అవుతారంట. అంటే, గరం నుంచి నరం, నరం నుంచి బేషరం.. ఇది పరిణామ క్రమంగా జరుగుతూ ఉంటుంది అని ఒక నానుడి ఉంది. ‘ఇది తప్పు' అని నిరూపించే బాధ్యత మీ దగ్గర ఉంది.
మీరందరూ కూడా కచ్చితంగా తెలంగాణ ఉడుకు రక్తాన్ని ప్రదర్శించి తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి సహకరించాలి. పేదవాడు, నిస్సహాయుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ కండ్లల్లో మీ తల్లిదండ్రులు గుర్తుకు రావాలి. ఇక్కడ ఉన్నవాళ్లలో 90 శాతం మంది తల్లిదండ్రులు పేదరికం నుంచే వచ్చిండ్రు. రేపటి నుంచి మీరు అధికారులు కాబోతున్నారు, ఆఫీసర్స్ కాబోతున్నారు. నిన్నటి వరకు మీరు నిరుద్యోగ యువకులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామాన్యమైన కుటుంబ సభ్యులు. కానీ, ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించే యంత్రాంగం, అధికారులు! ఈ రోజు నుంచే మీ టైటిల్ ‘ఆఫీసర్’..’’ " అని అన్నారు. ఈ ఆఫీసర్ అనే పదానికి ఎంతో ఇంటెన్సిటీ ఉందని, ఈ బలాన్ని అంచనా కూడా వేయలేరని, అన్ని డోర్లు ఓపెన్ అవుతాయని చెప్పారు.
నమ్మక ద్రోహులుగా మిగిలారు
"తెలంగాణ ఎక్కడున్నది? ఎట్ల ఉంటది? అని అడిగిన వారికి నేను ఒక్కమాట చెప్పదలుచుకున్నా. తెలంగాణ ఇక్కడనే ఉంది. తెలంగాణ ఇట్లనే ఉంటది. ఇదే తెలంగాణ స్ఫూర్తి, చైతన్యం, భవిష్యత్తు” అని రేవంత్‌రెడ్డి తెలిపారు. కొందరికి నమ్మకం, విశ్వాసంతో ప్రజలు బాధ్యతను అప్పజెప్పితే.. వాళ్లు విశ్వాస ఘాతకులుగా మారి అన్యాయం చేసి, నమ్మక ద్రోహులుగా ఈ చరిత్రలో నిలిచిపోయారని, కాలగర్భంలో కలిసిపోయారని బీఆర్ఎస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. గత పాలకులు కుటుంబ సభ్యులకు రాజకీయ ఉద్యోగాలు కల్పించుకున్నారని, నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. ఈ కార్యక్రమం సందర్భంగా అధికారులు పది పేజీల నోట్‌ను తన ముందు ఉంచారని, అయితే తాను ‘రీడర్‌ని కాదు, లీడర్‌ని’ అని చెప్పానన్నారు. ‘‘2011లో ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్షలు నిర్వహిస్తే, 2023 వరకు దాదాపు 12 ఏండ్లు ఈ పరీక్షలు నిర్వహించలేదు. ఇంత బాధ్యతారహితమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా?”అని ప్రశ్నించారు.