నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం

నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం

ఆదివారం ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రజాస్వామ్య  దేశంలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రధానికి బహిరంగ లేఖ రాశానని అన్నారు. గతంలో ప్లానింగ్ కమిషన్ వల్ల దేశం అభివృద్ధి చెందిందన్న ఆయన... అలాంటి ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ తెచ్చారని అన్నారు. ప్రస్తుతం ఆ సంస్థ నిరర్థక సంస్థగా, ప్రధాని భజన మండలిగా మారిందని కేసీఆర్ విమర్శించారు. అప్పట్లో మంచి చెప్తే వినే ప్రధానులు ఉండేవారని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అన్నారు.

ఆదాయం కాదు.. పెట్టుబడి డబుల్
దేశంలో ఎప్పుడు లేనటు వంటి పరిస్థితులు నెలకొన్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.  విద్వేషాన్ని అసహనాన్ని పెంచుతున్న ఎన్డీఏ సర్కారు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. దేశ చరిత్రలోనే ఎప్పుడు లేనట్టుగా 13 నెలల పాటు రాజధానిలో ఆందోళన చేసి 800 మంది ప్రాణాలు కోల్పోతే.. ప్రధాని మోడీ క్షమాపణ చెప్పి చట్టాలు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. రైతుల పెట్టుబడి రెట్టింపు అయిందే తప్ప ఆదాయం డబుల్ కాలేదని విమర్శించారు. తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగా లేదన్న విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. ఇక దేశ రాజధానిలో మంచి నీటి కటకట ఉందంటే నీతి ఆయోగ్ ఏం చేస్తోందని కేసీఆర్ ప్రశ్నించారు.

నీతి ఆయోగ్ తో ఎలాంటి మార్పు రాలె

ఉపాధి హామీ కూలీలు సైతం జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టే పరిస్థితి తలెత్తిందని, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఒకవైపు నిరుద్యోగం పెరిగిపోతుండగా.. మరోవైపు రూపాయి విలువ పాతాళానికి పడిపోతోందని ఇలాంటి పరిస్థితుల్లో నీతి ఆయోగ్ ఏం మార్పు తెచ్చిందని నిలదీశారు. మిషన్ కాకతీయకు రూ. 5వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ. 19వేల కోట్లు మొత్తంగా రూ. 24వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించినా కేంద్రం 24 పైసలు కూడా ఇవ్వలేదని కేసీఆర్ విమర్శించారు. కేంద్ర వైఖరి కారణంగా అంతర్జాతీయ విపణిలో భారత్ ఇజ్జత్ పోతోందని చెప్పారు.