గిరిజనులను మోసం చేసిన కేసీఆర్ : బలరాం నాయక్

గిరిజనులను మోసం చేసిన కేసీఆర్ : బలరాం నాయక్

హైదరాబాద్​, వెలుగు: గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం కేసీఆర్​ అడుగడుగునా మోసం చేశారని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్​ విమర్శించారు. మంగళవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తానన్న కేసీఆర్​.. ఆ హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. 

గిరిజన కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేస్తామని చెప్పినప్పటికీ వాటికి పైసా కూడా రాలేదని ఆరోపించారు. ఐటీడీఏ ఫండ్స్​ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. గిరిజనులకు కేసీఆర్ పోడు పట్టాలను ఇవ్వడం లేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను తీసుకొచ్చి కాంగ్రెస్ వారికి మేలు చేస్తే.. కేసీఆర్ మాత్రం రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారని విమర్శలు గుప్పించారు. 

ట్యాంక్​బండ్​పై చెట్లు పెట్టినంత మాత్రాన, లుంబినీ పార్క్​ వద్ద బంగ్లా కట్టినంత మాత్రాన అభివృద్ధి జరిగినట్టు కాదన్నారు. కేసీఆర్​కు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని, ఓటమి తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్​ను గెలిపించి తెలంగాణను సోనియా గాంధీకి కానుకగా ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.