
సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఆకాష్ సాగర్ చోప్రా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రీమద్ భాగవతం పార్ట్-1’.సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబించే ఒక గొప్ప ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు . సోమవారం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రంగారెడ్డి, నిర్మాత మోతీ సాగర్ సహా తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ALSO READ : ‘లజ్జా’ డైరెక్టర్ కొత్త సినిమా షురూ.. 1980 బ్యాక్‌డ్రాప్‌లో “ప్రభుత్వ సారాయి దుకాణం”
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘శ్రీమద్ భాగవతం సినిమా తీయాలన్న ఆలోచన వచ్చినందుకు టీమ్‌ను అభినందిస్తున్నా. తరం మారుతున్న ఈ సమయంలో ఇలాంటి సినిమాలు చాలా అవసరం. 2047 విజన్ డాక్యుమెంట్‌లో సినిమా రంగానికి ఒక ప్రత్యేక చాప్టర్ ఉంటుంది’అని అన్నారు. వచ్చే ఏడాది ‘శ్రీమద్ భాగవతం’ మొదటి భాగాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేశారు.