ప్రజలతో కలిసి.. సాగర్​ తీరం వెంట నడిచి..

ప్రజలతో కలిసి.. సాగర్​ తీరం వెంట నడిచి..
  • వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్​
  • క్రేన్ ఆపరేటర్లు, బల్దియా కార్మికురాలితో ముచ్చట్లు
  • ఇబ్బందులు తెలుసుకొని ప్రత్యేక ఏర్పాట్లు
  • ముఖ్యమంత్రిని చూసి కేరింతలు కొట్టిన జనం
  • ప్రజలకు అభివాదం చేస్తూ వెనుదిరిగిన సీఎం
  • సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు:  ప్రజలతో కలిసి.. హుస్సేన్​సాగర్​తీరం వెంట నడుచుకుంటూ వచ్చిన సీఎం రేవంత్​.. గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్టీఆర్ మార్గ్‌‌ లో కాలినడకన తిరుగుతూ బడా గణేశ్​నిమజ్జనాన్ని పర్యవేక్షించారు. నిమజ్జనం జరిగే 6వ నెంబర్ క్రేన్ వద్ద  ఏర్పాట్లను పరిశీలించారు. సెక్రటేరియెట్​నుంచి బయలుదేరి.. క్రేన్ నంబర్​ 9 నుంచి 3వ నంబర్​ క్రేన్ వరకు అన్నిచోట్ల ఆగుతూ.. ఏర్పాట్లపై ఆరా తీశారు.

 క్రేన్​డ్రైవర్ల​తోపాటు బల్దియా కార్మికులు, పబ్లిక్ తో మాట్లాడారు.  నిమజ్జనం కోసం ట్రాక్టర్ పై గణేశ్ ని తీసుకొస్తున్న  వారిని పలకరించారు. ‘‘ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయా?’’ అని అడిగారు. అలాగే, జీహెచ్ఎంసీ కార్మికులతో మాట్లాడారు.  నిమజ్జనం విధుల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. తాగేందుకు నీళ్లులేవని ఓ కార్మికురాలు తెలుపగా..హుస్సేన్​సాగర్​లోని నీటి శుద్ధి యంత్రాలను పరిశీలించారు.

అక్కడున్న వారందరికీ తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. క్రేన్​ఆపరేటర్లతోపాటు ఇతర సిబ్బందికి 3 షిఫ్టుల్లో విధులు కేటాయించాలని అధికారులకు రేవంత్​ సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ అలర్ట్​గా ఉండాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. నిమజ్జనం ముగిసేవరకు అందరూ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.

కాగా, గణేశ్​శోభాయాత్ర ఏర్పాట్లను పరిశీలించేందుకు సీఎం రాగా.. ఆయనను చూసి జనం కేరింతలు కొట్టారు. ప్రజలకు అభివాదం చేస్తూ రేవంత్​ వెనుదిరిగారు. ఈ సందర్భంగా సీఎం ఓ చిన్నారిని ఎత్తుకున్నారు. సీఎం వెంట పీసీసీ ప్రెసిడెంట్​ మహేశ్ ​గౌడ్​, ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్​ గద్వాల విజయలక్ష్మి ఉన్నారు. 

సీఎం ఆదేశాలతో స్లీపర్​ క్లాస్​ బస్సులు

విశ్రాంతి తీసుకునేందుకు ఇబ్బందిగా ఉందని సీఎం రేవంత్​కు క్రేన్ ఆపరేటర్స్ తెలిపారు. దీంతో క్రేన్ ఆపరేటర్లతోపాటు ఇతర సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు రేవంత్​ సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సానిటేషన్ కార్మికులతోపాటు  క్రేన్ ఆపరేటర్లు,  హెల్పర్స్ రెస్ట్​ తీసుకునేందుకు అధికారులు స్లీపర్​ క్లాస్ బస్సులను ఏర్పాటు చేశారు.

హుస్సేన్​సాగర్, సరూర్​నగర్ లేక్, కూకట్ పల్లి ఐడీఎల్ లేక్, ఎల్బీనగర్ చెరువుల  వద్ద ఈ బస్సులను అందుబాటులో ఉంచారు.  అన్నిచోట్ల కలిపి 7 బస్సులను ఏర్పాటు చేయగా.. సిబ్బంది వినియోగించుకున్నారు.