హైదరాబాద్, వెలుగు: ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి, రిటర్న్‌లు వేయని వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి రూ.1,000 కోట్లు వసూలు చేయాలని రాష్ట్ర కమర్షియల్ట్యాక్స్ డిపార్ట్మెంట్ సన్నాహాలు చేస్తున్నది. ఆ వ్యాపారస్తుల్లో అవగాహన కల్పించి రిటర్న్‌లు వేయించే కార్యక్రమాన్ని చేపట్టింది. కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు సెలవులు రద్దు చేయడంతో పాటు ఆదివారం కూడా పని చేయాలని స్పష్టం చేసింది.
వేల మంది ఇతర రాష్ట్రాల్లో గూడ్స్ కొనుగోళ్లు, సర్వీసులు వినియోగిస్తున్నప్పటికీ.. వాటికి చెందిన వివరాలు నెలవారీ, యాన్వల్ రిటర్న్‌లలో చూపడం లేదని తేలింది. దీంతో వ్యాపారులు చెల్లించిన జీఎస్టీ తిరిగి తీసుకునే వెసులుబాటు లేకుండా పోయింది. మరోవైపు, రాష్ట్ర ఖజానాకు జమ కావాల్సిన మొత్తం కూడా జమ అవ్వడం లేదని తెలుసుకుంది. ఇలాంటి వ్యాపార, వాణిజ్య సంస్థలు ఎన్ని ఉన్నాయని ఆరా తీసిన ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ విభాగం.. 36 వేలకుపైగా సంస్థలు ఉన్నట్లు గుర్తించింది.
