ప్రశ్నించే గొంతులను బతికించిన జనం.. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీకి పెరిగిన బలం

ప్రశ్నించే గొంతులను బతికించిన జనం.. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీకి పెరిగిన బలం

దాదాపు సగం అసెంబ్లీ సీట్ల పరిధిలో పట్టు ..నాలుగు నెలల్లోనే తీర్పు మార్చిన ఓటర్లు..దూకుడుగా పోతున్న టీఆర్ఎస్ కు కళ్లెం. వరుస ఫిరాయింపులపై జనంలో అసహనం. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే కనిపించిన సంకేతం. ఇక సీఎల్పీ విలీనం ప్రయత్నాలకు బ్రేక్? . సరికొత్త విపక్షంగా అవతరించిన బీజేపీ. కాంగ్రెస్‌ బలంగా లేనిచోట్ల కమలానికి చాన్స్.

అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత సరిగ్గా నాలుగు నెలలకు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో జనం తీర్పు మారింది. శాసనసభలో అధికార పక్షానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చిన జనం పార్లమెంటుకు వచ్చేసరికి మనసు మార్చుకున్నారు. అసెంబ్లీలో వన్ సైడ్ గా ఇచ్చిన తీర్పులో ఊహించని సవరణలు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. రాష్ట్రంలో పూర్తిగా బలహీనపడిన విపక్ష గళాలకు మళ్లీ ప్రాణం పోశారు. ఉద్యమాలతో చైతన్యం నింపుకున్న జనం… ప్రశ్నించే గొంతులు ఉండాల్సిందేనని సంకేతాలిచ్చారు. రాష్ట్రంలో విపక్షం లేకుండా చేసే ప్రయత్నాలకు పెద్ద అడ్డుకట్ట వేశారు. ఈసారి ఒకటి కాదు ఏకంగా రెండు విపక్షాలను నిలబెట్టారు.

హైదరాబాద్‌‌, వెలుగు:లోక్ సభ ఎన్నికల్లో జనం తీర్పుతో రాష్ట్రం రాజకీయంలో ఊహించని మార్పు కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా పోయే పరిస్థితి నుంచి ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు రెండు విపక్షాలుగా ఊపిరి పోసుకున్నాయి. నాలుగునెలల తేడాలోనే జనం ఇచ్చిన ఈ తీర్పు రాజకీయ విశ్లేషకులనే విస్మయానికి గురిచేస్తోంది. ‘సారు, కారు, సర్కారు, పదహారు’ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన అధికార టీఆర్‌‌ఎస్‌‌ అసెంబ్లీ ఎన్నికల నాటి హవా కొనసాగుతుందని పూర్తిగా నమ్మింది. ఎక్కువ సీట్లు గెలిచిన కేంద్రంలోనూ కీలకపాత్ర పోషించాలని భావించింది. అయితే ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ 9 సీట్లకే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సంక్షేమ పథకాలతో జనాన్ని ఆకట్టుకున్న గులాబీ పార్టీకి ఆ పథకాలే అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లతో భారీ మెజారిటీని తెచ్చిపెట్టాయి. ఇది 2014 ఎన్నికల్లో సాధించిన 63 సీట్ల కంటే చాలా ఎక్కువ. తర్వాత మరో ఇద్దరు స్వతంత్రులు చేరడంతో సీట్లు 90కి పెరిగాయి. దీంతో అసెంబ్లీలో దాదాపు 80 శాతం సీట్లు గులాబీ సొంతం అయ్యాయి.

అయినా ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి ఒకరొకరుగా ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ వచ్చారు. కాంగ్రెస్ నుంచి గెలిచింది 19 మంది అయితే వారిలో 11 మంది పార్టీ ఫిరాయించి కారులో చేరుతున్నట్లు ప్రకటించారు. టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే వారిలో ఒకరు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో పార్టీ బలం 102 సీట్లకు చేరుకుంది. ఆ తర్వాత కూడా మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే ఆ పార్టీ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోల్పోతుంది. ఈ ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలోనే వెలువడిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి షాకిచ్చాయి.

ప్రతిపక్షం ఉండొద్దా?

గత ఏడాది డిసెంబర్లోనే గెలిపించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వరుసగా పార్టీ మారడంపై జనంలో అసహనం కనిపించింది. పార్టీ మారినవారికి లోక్ సభ, పరిషత్ ఎన్నికల ప్రచారాల్లో పలుచోట్ల నిరసనలు ఎదురయ్యాయి. కొన్నిచోట్ల ఘర్షణలు కూడా జరిగాయి. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌‌, నకిరేకల్‌‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సహా పలువురు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు జనం నుంచి చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేక ప్రాంతాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమను మోసం చేశారంటూ జనం, కార్యకర్తలు పోలీస్‌‌ స్టేషన్లలో చీటింగ్‌‌ కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారన్న భావనను జనంలో కలిగించాయి. తమ సమస్యలపై మాట్లాడేవారే ఉండరన్న ఆందోళననను వారిలో రేపాయి. అసెంబ్లీలో మంచి బలం ఉన్నా ఫిరాయింపులను ప్రోత్సహిస్తుండడంపై అధికార పార్టీ తీరు మీదా పలు వర్గాల్లో అసంతృప్తి మొదలైంది. లోక్ సభ ఎన్నికలకు సరిగ్గా మూడు వారాల ముందు జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనం అసహనం తొలిసారి బయటపడింది.

కరీంనగర్‌‌ గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని ఊహించని మెజారిటీతో గెలిపించారు. కరీంనగర్‌‌, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ సీట్ల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ మద్దతిచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్సీలను ఘోరంగా ఓడించారు. దీంతో అప్పటికే దాదాపు విపక్షం ఖాళీ అయిపోయిన శాసన మండలికి ముగ్గురు విపక్ష గళాలను పంపించారు. అయితే కొంతమంది ఉద్యోగ వర్గాలే తమకు వ్యతికంగా ఉన్నాయనీ, వారు అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమకు ఓట్లేయలేదని అధికార పార్టీ సమర్థించుకుంది. సామాన్య జనం తమవైపే ఉన్నారని చెప్పింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల తీర్పుతో టీఆర్ఎస్ పునరాలోచనలో పడింది.

సగం సీట్లలో పెరిగిన బలం

రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో టీఆర్ఎస్ 9 గెలిస్తే రెండు విపక్షాలకు కలిపి 7 సీట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో విపక్షాలకు వచ్చిన ఓట్లను అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా చూస్తే దాదాపు 50 నుంచి 55 నియోజకవర్గాల్లో అధికార పార్టీ కంటే ఎక్కువగా ఉండడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్‌‌కు వచ్చిన ఓట్లలో ఒక్కో సెగ్మెంట్‌‌కు 10 నుంచి 30 వేల వరకు విపక్షాలకు పడ్డాయి.