
భారతదేశంలో ఆటో రంగం ఈవీల వైపు మారుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు సైతం డీజిల్, పెట్రోల్ కార్ల నుంచి ఎలక్ట్రిక్ కార్లకు మారుతున్నారు. దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ఇప్పటికే అనేక ఈవీ వేరియంట్లను కస్టమర్ల బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా ప్రవేశపెట్టి పెద్ద సక్సెస్ సాధించింది. ఈ క్రమంలోనే టాటాలు వాహనదారుల కోసం సరికొత్త ఆఫర్ ప్రకటించటం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
వివరాల్లోకి వెళితే టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్ మోడళ్లైన కర్వ్, నెక్సన్ ఈవీ 45 మోడళ్లకు ఇకపై జీవితకాలం బ్యాటరీ వారెంటీ అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో భారత ట్రాన్స్ పోర్ట్ చట్టాల ప్రకారం వాహన జీవితకాలం అంటే 15 ఏళ్ల పాటు సుదీర్ఘ బ్యాటరీ వారెంటీని అందించటంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈవీ బ్యాటరీల జీవితకాలం, వాటి మార్పిడి ఖర్చుల గురించి చాలా మంది కార్ కొనుగోలుదారులు ఆలోచిస్తూ ఈవీలకు మారటంపై డైలమాలో ఉన్న సమయంలో టాటా గ్రూప్ సాహసోపేతమైన లైఫ్ టైమ్ వారెంటీ ఆఫర్ తీసుకురావటం పరిశ్రమలో పోటీని ప్రేరేపిస్తోంది.
కంపెనీ ప్రకటించిన లైఫ్ టైమ్ ఈవీ బ్యాటరీ ఆఫర్ ప్రస్తుతం ఉన్న ఫస్ట్ హ్యాండ్ ఓనర్లతో పాటు కొత్తగా కార్లను కొనేవారికి కూడా వర్తిస్తుందని తెలిపింది. దీని కింద కారు యజమానులు రిజిస్ట్రేషన్ తేదీ నుంచి వాహన చట్టాల ప్రకారం కారు జీవితకాలం చివరి రోజు వరకు ఆఫర్ కవర్ చేస్తుంది. తాజా ప్రకటనకు ముందు టాటా గ్రూప్ ఇదే ఆఫర్ తన హారియర్ ఈవీపై తొలుత అందిస్తున్నట్లు ప్రకటించింది.
ALSO READ : కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే మీకే డబ్బులు మిగులుతాయి..
ఎలక్ట్రిక్ కార్ యజమానులు జంజాటాలు లేని అనుభూతి కోసం తమ ఆఫర్ తోడ్పడుతుందని కంపెనీ చెబుతోంది. దీనికి తోడు కర్వ్ ఈవీ, నెక్సన్ ఈవీ కొనుగోలుదారులకు అదనంగా రూ.50వేలు లాయర్టీ బెనిఫిట్స్ కొనుగోలు సమయంలో అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. కొత్త బ్యాటరీ వారెంటీ కింద తమ ఎలక్ట్రిక్ కార్ యజమానులు తక్కువ రన్నింగ్ ఖర్చుల కారణంగా 10 ఏళ్ల కాలంలో రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షల మధ్య సొమ్ము ఆదాచేసుకోగలరని టాటా మోటార్స్ వెల్లడించింది.