రాష్ట్ర కాంగ్రెస్​లో చిచ్చు రేపిన చేరిక!

రాష్ట్ర కాంగ్రెస్​లో చిచ్చు రేపిన చేరిక!
  • ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో చేరిన టీఆర్ఎస్ మాజీ నేత వడ్డేపల్లి రవి

నల్గొండ/సూర్యాపేట, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఓ చేరిక కొత్త చిచ్చుపెట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ సీనియర్ల మధ్య నెలకొన్న గ్రూప్​ పాలిటిక్స్ మరోసారి బహిర్గతమయ్యాయి. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి అద్దంకి దయాకర్​కు వ్యతిరేకంగా పని చేసి టీఆర్​ఎస్​లో చేరిన వడ్డేపల్లి రవి ఆదివారం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఆ వెంటనే ఈ చేరికను సవాల్​ చేస్తూ అద్దంకి దయాకర్​ పీసీసీ ప్రెసిడెంట్​కు లెటర్​ రాశారు. దీంతో రవిను కలిసేందుకు పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి కనీసం అపాయింట్​మెంట్​ ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది.

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సమక్షంలో..

2018 ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ ఆశించి రాకపోవడంతో టీఆర్ఎస్​లో చేరిన వడ్డేపల్లి రవి కొంతకాలంగా సొంత గూటికి వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్​లో చేరాక రవి తన భార్యను సూర్యాపేట మున్సిపల్ కౌన్సిలర్​గా పోటీ చేయించారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఆశించినప్పటికీ టీఆర్ఎస్​లో సరైన గుర్తింపు లభించకపోవడంతో తిరిగి కాంగ్రెస్​లోకి రావాలని డిసైడయ్యారు. వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న రవి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి సపోర్ట్​తో పార్టీలో చేరతారని ముందు నుంచీ ప్రచారం జరిగింది. కానీ ఊహించని రీతిలో దామోదర్ రెడ్డి ప్రమేయం లేకుండానే రవి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. పీసీసీ అనుమతితో గాంధీ భవన్​లో జరగాల్సిన వడ్డేపల్లి రవి చేరిక ప్రోగాం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి నివాసంలో జరిగింది. రవి చేరిక చెల్లదని సూర్యాపేట డీసీసీ ప్రెసిడెంట్ వెంకన్న యాదవ్ ఆదివారం మీడియా సమావేశంలో ప్రకటించారు.  

దామోదర్ రెడ్డితో వడ్డేపల్లి వైరం

మాజీ మంత్రి దామోదర్ రెడ్డితో వడ్డేపల్లి రవి సంబంధాలు దెబ్బతిని చాలా కాలమైందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో దామోదర్ రెడ్డికి వ్యతిరేకంగా సూర్యాపేటలో రవి వర్గం పనిచేసిందని, వీరిద్దరి మధ్య సంబంధాలు అప్పటి నుంచే తెగిపోయాయని అంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేయాలంటే పార్టీ పెద్దల సపోర్ట్ అవసరమని భావించిన రవి.. ఎంపీ కోమటిరెడ్డి గూటికి చేరినట్లు ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా తుంగతుర్తి నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఫోటోలతోనే రవి పర్యటిస్తున్నారు. పైగా ఎంపీ కోమటిరెడ్డి పరిధిలోనే తుంగతుర్తి నియోజకవర్గం ఉన్నందున రవి చేరికకు పార్టీ హైకమాండ్​ సైతం అడ్డుచెప్పదని భావించారు. రవి చేరేందుకు సూర్యాపేట కాంగ్రెస్ నేత, రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు పటేల్ రమేశ్​రెడ్డి సపోర్ట్ కూడా ఉందని చెబుతున్నారు. రమేశ్​రెడ్డి సైతం దామోదర్ రెడ్డికి వ్యతిరేకంగా కోమటిరెడ్డితో సత్సబంధాలు కొనసాగిస్తున్నారు. దామోదర్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఆయన వ్యతిరేకవర్గం అంతా కోమటిరెడ్డి గూటికి చేరుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

నకిరేకల్​లోనూ కోమటిరెడ్డి టీమ్

తుంగతుర్తి, నకిరేకల్ ఎస్సీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థులు లేరని, ఆర్థికబలం, జనాకర్షణ కలిగిన నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ఎంపీ కోమటిరెడ్డి ఇప్పటి నుంచే గాలిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నకిరేకల్​లోనూ జానారెడ్డి అనుచరుడు, పీసీసీ కార్యదర్శి కొండేటి మల్లయ్య, స్థానిక నాయకుడు దైదా రవీందర్​ టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అయితే వీరికి బదులుగా ఎన్నికల నాటికి కొత్తగా ఎన్ఆర్ఐ క్యాండిడేట్​ను రంగంలోకి దింపేందుకు సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలిసింది.