లొల్లులు ఆపి.. సర్కార్​తో కొట్లాడాలె

లొల్లులు ఆపి.. సర్కార్​తో కొట్లాడాలె
  • ఈగోలకు పోవద్దని రాహుల్ క్లాస్ 
  • మీడియాకెక్కితే కఠిన చర్యలుంటాయని హెచ్చరిక
  • ప్రజా సమస్యలపై పోరాడమన్నారు: రేవంత్​
  • నేతల మధ్య విభేదాలపై అడిగారు: ఉత్తమ్​
  • రాష్ట్రానికి రావాలని కోరాం: భట్టి విక్రమార్క
  • మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన అసంతృప్త నేతలు

హైదరాబాద్, వెలుగు: విభేదాలు వీడి అందరూ కలిసి పోరాడి తెలంగాణలో కాంగ్రెస్​ను అధికారంలోకి తేవాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్​గాంధీ రాష్ట్ర నాయకులకు సూచించారు. అంతర్గత వ్యవహారాలతో రాష్ట్రంలో పార్టీ పరువు తీస్తున్నారని.. ఈగోలకు పోవద్దని క్లాస్ పీకారు. ఢిల్లీలో సోమవారం సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాహుల్​తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేతలు తమ కడుపులో ఉన్నదంతా వెళ్లగక్కారు. అన్ని విషయాలు శ్రద్ధగా విన్న ఆయన విభేదాలు పక్కన పెట్టాలని, కొన్నింటిని తాము పరిష్కరిస్తామని చెప్పారు. వివాదాలతో కాలం గడిపితే.. ఇగ ఎప్పుడు ప్రజల్లోకి వెళ్తారని నిలదీశారు. ఏమైనా విభేదాలు ఉంటే చర్చించి పరిష్కరించుకోవాలని.. ఇకపై ఎవరైనా మీడియాకు ఎక్కితే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

భేటీ తర్వాత కొందరు నేతలు అందించిన సమాచారం ప్రకారం రాహుల్ ఎవరితో విడివిడిగా సమావేశం కాలేదని, భేటీలోనే అందరి అభిప్రాయలు అడిగినట్లు తెలిసింది. ముందుగా రాహుల్ మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఏం చేయాలి, ఎలాంటి పోరాటాలు చేపట్టాలి, ప్రజల్లో విశ్వాసం పెంచుకోవడంపై ఆయా నేతలను ఒక్కొక్కరుగా మాట్లాడాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చేందుకు సూచనలు ఇవ్వమన్నారు. దాంతో నేతలు ఒక్కొక్కరుగా అభిప్రాయాలు వెల్లడించారు. రేవంత్​తో కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్న కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్​లాంటి నేతలు ఓపెన్​గా తమ మనసులోని మాటలు చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొన్ని సభల్లో ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తున్నారని, ఇది పార్టీ నియమాలకు విరుద్ధంగా జరుగుతోందన్నారు. హైకమాండ్ మాత్రమే పేర్లు ప్రకటించే సంప్రదాయం పార్టీలో ఉందని, అయితే ఇందుకు విరుద్ధంగా టికెట్లు ఇస్తున్నట్లు పేర్లు ప్రకటించడం తమకు ఇబ్బందికరంగా ఉందన్నట్లు చెప్పారు. కావాలంటే పార్టీ హైకమాండ్ ఎన్నికలకు ఏడాది ముందే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తే మంచిదని ఆయన సూచించినట్లు సమాచారం.

పోరాడాలని చెప్పారు: పార్టీ నేతలు 
భేటీ తర్వాత బయటకు వచ్చిన రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విభేదాలను పక్కనబెట్టి, ప్రజా సమస్యలపై పోరాడాలని రాహుల్ సూచించారని చెప్పారు. అన్ని సమస్యలు పరిష్కరించుకుని ముందుకు వెళ్లాలని తాము నిర్ణయించుకున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజల్లో పోరాడుతామన్నారు. రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులపై రాహుల్‌ గాంధీతో చర్చించామని, బీజేపీ, టీఆర్‌‌ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా ప్రతి గ్రామానికి వెళ్లాలని ఆయన సూచించారని చెప్పారు. ఎంపీ ఉత్తమ్ కుమార్‌‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలపై రాహుల్ గాంధీతో చర్చించామన్నారు. నాయకుల మధ్య ఉన్న విభేదాలపై ఆయన అడిగి తెలుసుకున్నారని చెప్పారు. అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని సూచించారని ఉత్తమ్ తెలిపారు. టీఆర్ఎస్​తో ఎంఐఎం దోస్తీ గురించి రాహుల్​తో చర్చించామని చెప్పారు. కలిసికట్టుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఐకమత్యంగా ప్రజల్లోకి వెళ్లి పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తామని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రానికి రాహుల్ గాంధీ రావాలని ఆహ్వానించామని, వీలైనన్ని ఎక్కువ సార్లు వస్తానని ఆయన హామీ ఇచ్చారన్నారు. కాగా, అసంతృప్త నేతలు సమావేశం కాగానే మీడియాతో మాట్లాడటానికి నిరాకరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు సోమవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ప్రజల పక్షాన చేపట్టాల్సిన కార్యక్రమాలు గురించి సోనియాతో చర్చించానని మీడియాకు తెలిపారు. త్వరలో తాను రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటిస్తానని చెప్పారు. 

మాపై సోషల్​ మీడియాతో దాడి చేస్తున్నరు
పార్టీలో తనకు ఇటీవల ఎదురైన అవమానాల గురించి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాహుల్​కు వివరించినట్లు తెలిసింది. తాను కేవలం పీసీసీ చీఫ్ ఒంటెత్తు పోకడలను మాత్రమే ప్రశ్నించానన్నారు. తన నియోజక వర్గానికి వచ్చినప్పుడు కనీస సమాచారం ఇవ్వకపోవడం పట్ల అభ్యంతరం తెలిపానన్నారు. సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న దాడి విషయంలో ఆవేదన చెందానని, పార్టీ మారుతున్నట్లు జరిగిన ప్రచారంపై మనస్తాపం చెందానని చెప్పారు. పార్టీ కోసం తాను ఎవ్వరితోనైనా కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పినట్లు సమాచారం. వీహెచ్ కూడా పార్టీలో తనపై జరుగుతున్న దాడి గురించి వివరిస్తూనే కలిసి పోరాడాల్సిన అవశ్యకతను వివరించారని సమాచారం. ఇటీవల పార్టీ లాయలిస్టుల ఫోరానికి చెందిన కొందరు నాయకులు రేవంత్ పేరు ప్రస్తావించకుండా కాంగ్రెస్​లో ఉమ్మడి నిర్ణయాలు తీసుకునే సంస్కృతిని వివరించినట్లు తెలిసింది. ఏ పని చేసినా కలిసి కట్టుగా చర్చించి ఒక మాట మీదకు వచ్చే సంప్రదాయం పార్టీలో ఉందని, దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు తెలిసింది. నేతల మధ్య అనుసంధాన కర్తలుగా ఏఐసీసీ ఇన్​చార్జ్​లు ఉండాలని వారు 
సూచించినట్లు సమాచారం.