అలుపెరుగని పోరాట యోధుడు.. గద్దర్‌కు‌ కాంగ్రెస్ నివాళి

అలుపెరుగని పోరాట యోధుడు..  గద్దర్‌కు‌ కాంగ్రెస్ నివాళి

హైదరాబాద్, వెలుగు: ఎన్నో ఏండ్లుగా ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న గద్దర్ మరణం తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటు అని ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘గద్దర్ తెలంగాణ పోరాట యోధుడు. తెలంగాణ సాధన కోసం తన ఆట, పాటలతో జనాన్ని ఉత్తేజపరిచారు. ఇటీవలే ఖమ్మంలో రాహుల్ గాంధీతో  గద్దర్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆయన మరణాన్ని తట్టుకోలేకపోతున్నాం’’ అని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గద్దర్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. గద్దర్ కన్నుమూతపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు. గద్దర్ తన జీవితాన్నంతా ప్రజలకే అంకితం చేశారని, తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటతో లక్షల మందిని ఉద్యమం వైపు నడిపించారని కొనియాడారు. ఆయన సేవలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు. గాంధీభవన్‌లో గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి రేవంత్‌రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు.

ఇట్ల జరుగుతుందనుకోలే: విమలక్క

కామ్రేడ్ గద్దరన్నది పూర్తిగా ప్రజల బాట అని అరుణోదయ కళాకారిణి విమలక్క అన్నారు. గద్దర్ భౌతికంగా మన దగ్గర లేనప్పటికీ ఆయన పాటలు మనతో ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. ‘‘చివరగా నిమ్స్ లో గద్దర్ ని కలిశాను. అప్పుడు అందరం కలిసి ఫోటో దిగుదామని ఆయన అన్నారు. అదే ఆయన్ను చివరి సారి చూడటం” అని భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘ఒక పార్టీ పెడుతున్నానని గద్దర్ చెప్పారు. అందరం బలమైన సంసృతి ఉద్యమాన్ని తీసుకురావాలని నాతో అన్నారు. మళ్లీ కలుస్త చెల్లి అని చెప్పిండు. ఇట్ల జరుగుతుందని అనుకోలే’’ అని పేర్కొన్నారు. తర్వాత గద్దర్ పై పాడిన ఓ పాటని వినిపించారు. ‘పాటకు లేదు మరణం.. నీ పాటకు లేదు మరణం, విప్లవ శకాన గద్దర్ జననం.. విప్లవ గీతపు పల్లవి చరణం’’ అంటూ పాడారు.

ఓ శకం ముగిసింది: ఘంటా చక్రపాణి

గ‌ద్దర్ మ‌ర‌ణం తెలంగాణ‌కు తీర‌ని లోటు అని టీఎస్‌పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చ‌క్రపాణి అన్నారు. అన్ని ఉద్యమాల‌కు సాక్షీభూతంగా గద్దర్ ఉన్నార‌ని కొనియాడారు. ‘‘ఒక శ‌కం ముగిసింది. గ‌ద్దర్ ఒక ప్రాంతానికి చెందిన వాడు కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిన యోధుడు. ఇన్నేళ్లపాటు ఆయన బ‌త‌క‌డానికి కార‌ణం ప్రజ‌ల మీద ఉన్న ప్రేమ త‌ప్ప మ‌రొక‌టి కాదు. ఆయుధం అంటే ఆలోచ‌న‌, ఆయుధం అంటే పాట‌, ఆయుధం అంటే ఓటు అని గద్దర్ అనేవారు. ఇలాంటి గాయ‌కుడు మళ్లీ పుట్టరు” అని ఘంటా చెప్పారు.