వడ్ల కొనుగోళ్లలో ఆలిండియా రికార్డ్..రెండు సీజన్లలో కలిపి 1.47 కోట్ల టన్నుల ధాన్యం సేకరించాం: మంత్రి ఉత్తమ్

వడ్ల కొనుగోళ్లలో ఆలిండియా రికార్డ్..రెండు సీజన్లలో కలిపి 1.47 కోట్ల టన్నుల ధాన్యం సేకరించాం: మంత్రి ఉత్తమ్
  • దేశం మొత్తం కొనుగోళ్లలో 61శాతం తెలంగాణదే
  • కేంద్ర లక్ష్యాలను మించి 75 లక్షల టన్నులు అధికంగా కొనుగోలు
  • రైతుల కోసం రూ.16,645 కోట్ల అదనపు భారం భరించాం 
  • దిగుబడి 28% పెరిగినా.. సేకరణ లక్ష్యాన్ని 79 లక్షల నుంచి 52 లక్షల టన్నులకు కేంద్రం తగ్గించింది 
  • ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారమని ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో చరిత్ర సృష్టించామని, వానకాలం, యాసంగి రెండు సీజన్లలో కలిపి ఇప్పటివరకు 1.47 కోట్ల టన్నుల ధాన్యం సేకరించామని సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘‘ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఈ యాసంగిలో భారీగా ధాన్యం సేకరించాం. ఇది దేశంలోనే రికార్డ్” అని ఆయన వెల్లడించారు. 2025–-26 యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్రంలో 65.91 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, దాదాపు 1.41 కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామని మంత్రి చెప్పారు.

కానీ కేంద్ర ప్రభుత్వం కేవలం 52 లక్షల  టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాన్ని మాత్రమే రాష్ట్రానికి కేటాయించిందని, అయినా, రైతులు ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పటికే 75 లక్షల  టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం ద్వారా ఆల్​ఇండియా రికార్డు నెలకొల్పిందన్నారు. ఈ మొత్తం కొనుగోళ్ల విలువ రూ.17,917 కోట్లు కాగా, ఆ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. మంగళవారం సెక్రటేరియట్‎లో మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ రఘురాంరెడ్డి, ఎమ్మెల్సీ శంకర్​నాయక్, కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ ​యాసంగి వడ్ల కొనుగోళ్ల వివరాలను మీడియాకు వెల్లడించారు.   

1.47 కోట్ల టన్నుల కొనుగోళ్లు.. 

వానకాలం, యాసంగి రెండు సీజన్లు కలిపి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం1.47 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ చరిత్రలోనూ ఇదే అత్యధిక సేకరణ అని చెప్పారు. మొత్తం 2.95 కోట్ల టన్నుల ఉత్పత్తిలో 1.47 కోట్ల టన్నులను కొనుగోలు చేసి రైతులకు రూ.35,077 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియలో 25.20 లక్షల రైతుల నుంచి  ధాన్యం సేకరించామని వివరించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న యాసంగి ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ఒక్కటే 61 శాతం వాటా కలిగి ఉందని ఉత్తమ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో 25.03 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందని, తెలంగాణలో 75 లక్షల టన్నులతో దాదాపు మూడు రెట్లు అధికంగా కొనుగోలు చేసినట్లు చెప్పారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ నంబర్-వన్ గా నిలవడం ప్రభుత్వ చర్యలకు నిదర్శనమన్నారు.

కేంద్రం లక్ష్యాల తగ్గింపుపై విమర్శలు

తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి 28 శాతం పెరిగినా కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 79 లక్షల టన్నుల నుంచి 52 లక్షల టన్నులకు తగ్గించిందని మంత్రి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, తాను పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఆహార శాఖను, ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐ అధికారులను లక్ష్యాలు పెంచాలని కోరినప్పటికీ స్పందన రాలేదన్నారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడిందని పేర్కొన్నారు. రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రెండేళ్లలో అదనంగా 57 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.16,645 కోట్లు చెల్లించామని వివరించారు. 

గన్నీ బ్యాగుల కొరత లేదు..

ధాన్యం కొనుగోళ్ల విషయంలో గన్నీ బ్యాగుల కొరత ఉందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఉత్తమ్ అన్నారు. కొనుగోళ్ల కోసం మొత్తం 20.86 కోట్ల గన్నీ సంచులను సిద్ధం చేశామని, అందులో 18.75 కోట్ల సంచులు వినియోగించినప్పటికీ ఇంకా 2.11 కోట్ల సంచులు నిల్వలో ఉన్నాయని తెలిపారు. కాగా, రైతు  వద్దకే కొనుగోలు సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు.

వానాకాలంలో 8,448 కేంద్రాలు, యాసంగిలో 8,575 కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు రవాణా భారం తగ్గించినట్లు తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలో రెండో స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో కేవలం 4,850 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఉండగా, తెలంగాణలో వాటికంటే దాదాపు రెండురెట్ల వరకు అధికంగా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే, తడిసిన 12,557  టన్నుల ధాన్యాన్ని ప్రత్యేక చర్యల ద్వారా బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించామని మంత్రి తెలిపారు. ఆ ధాన్యానికి కేవలం 12 గంటల్లోనే మద్దతు ధర చెల్లించి రైతులను నష్టాల నుంచి కాపాడినట్లు చెప్పారు. 

ప్రతిపక్షాల తీరుపై ఉత్తమ్ ఫైర్​

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ విజయవంతంగా సాగుతుండగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉద్దేశపూర్వకంగా రైతుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. తెలంగాణ రైతులకు న్యాయం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను మంత్రి కోరారు.   

ఇరిగేషన్ భూముల్లో సోలార్ పవర్

రాష్ట్రంలోని ఇరిగేషన్ శాఖకు చెందిన భూములు, జలాశయాలు, కాలువల వద్ద సౌర విద్యుత్ ఉత్పత్తికి కార్యాచరణ చేపట్టాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటును అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలు, ఇతర నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు భారీ స్థాయిలో విద్యుత్ వ్యయం జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా కరెంటు ఖర్చులు తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వనరులను పెంపొందించేందుకు సౌర విద్యుత్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల అవకాశాలను విస్తృతంగా పరిశీలించాలని అధికారులకు ఆయన సూచించారు. మంగళవారం జలసౌధలో ఆయన ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలపై సమీక్ష నిర్వహించారు.

ఆయా ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలను రూపొందించాలని, సాంకేతిక నిపుణుల సేవలను వినియోగించుకోవడంతో పాటు అవసరమైతే బయటి నిపుణ సంస్థల సహకారాన్ని  తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని 16 జలాశయాల వద్ద సోలార్ ప్రాజెక్టుల సాధ్యసాధ్యాలపై అధ్యయనాలు నిర్వహించినట్టు అధికారులు ఈ సందర్భంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. అనుకూలమైన జలాశయాలు, నీటిపారుదల భూముల్లో కేవలం 10 శాతం విస్తీర్ణాన్ని మాత్రమే వినియోగించినా దాదాపు 6 వేల నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సృష్టించే అవకాశం ఉందని వెల్లడించారు.