
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై కలెక్టర్లతో సీఎస్ సోమేష్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినందున అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. వరుసగా రెండు రోజులు సెలవులు వస్తున్నందున, సెలవులను ఉపయోగించుకోకుండా పునరావాస కార్యక్రమాలలో పాల్గొనాలని ఆదేశించారు సీఎస్. చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్రిడ్జిలు, రోడ్లు తెగిపోయిన దగ్గర ప్రయాణాలను నిలిపివేయాలన్నారు. పోలీసు, నీటి పారుదల, రోడ్లు భవనాలు, విద్యుత్, రెవెన్యూ శాఖల సమన్వయంతో పనిచేయాలని సీఎస్ ఆదేశించారు.