- 5% కమీషన్ కోసం దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఏర్పాటు
- నలుగురు బ్యాంకు ఉద్యోగులు సహా 208 మంది అరెస్ట్
- మ్యూల్ అకౌంట్లపై సీఎస్‌బీ ఆపరేషన్ క్రాక్‌డౌన్
- వివరాలు వెల్లడించిన సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా సైబర్ మోసాలతో లింక్ అయిన మ్యూల్ (అద్దె) అకౌంట్లపై ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0 ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొనసాగిస్తున్నది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ) నుంచి సేకరించిన డేటా ఆధారంగా సీఎస్‌బీ అధికారులు దేశ వ్యాప్తంగా సెర్చ్ ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ మేరకు సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తం 549 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా.. వరంగల్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు సహా మొత్తం 208 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
1,888 ఖాతాల్లో రూ.100 కోట్లు
ఆపరేషన్ క్రాక్ డౌన్‌లో భాగంగా సీఎస్‌బీ గుర్తించిన 1,888 మ్యూల్ అకౌంట్లకు దేశవ్యాప్తంగా 9,451 నేరాలతో సంబంధం ఉందని తేలింది. వీటిలో సుమారు రూ.100 కోట్లు డిపాజిట్ అయినట్లు అధికారులు వెల్లడించారు. సీఎస్‌బీ అరెస్ట్ చేసిన వారిలో 15 మంది మహిళలు, ఏడుగురు విద్యార్థులు, ఇద్దరు లెక్చరర్లు, విద్యుత్ ఉద్యోగి ఉన్నట్లు తెలిపారు. వీరంతా తమ అకౌంట్ల ద్వారా జరిగే లావాదేవీపై 5 శాతం కమీషన్ తీసుకుంటున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. సైబర్ మోసాలకు ఉపయోగించిన 63 మొబైల్ ఫోన్లు, 208 బ్యాంక్ పాస్‌బుక్‌లు,చెక్ బుక్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఉద్యోగులే ఆపరేట్ చేస్తున్నరు
సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసిన వారిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర , జూబ్లీహిల్స్ మర్చంట్ కోఆపరేటివ్ బ్యాంక్‌కు చెందిన ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు ఉన్నారు. వీరే మ్యూల్ అకౌంట్లను ఆపరేట్ చేస్తున్నారు. వీరితో పాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు, ప్రైవేట్ ఉద్యోగులు, ఆరోగ్య కార్యకర్తలు, విద్యార్థులు, దినసరి కూలీలు ఉన్నారు. మ్యూల్ అకౌంట్ హోల్డర్లు నకిలీ గుర్తింపులు, ఫోర్జరీ చేసిన కేవైసీ పత్రాలు, ప్రాక్సీ మొబైల్ నంబర్లను ఉపయోగించారు. మ్యూల్ ఖాతాలను తెరిచేందుకు రిక్రూట్ చేయడం, సిమ్ కార్డులను ఏర్పాటు చేయడం, ఏటీఎం కార్డులు, పిన్ వివరాలను సేకరించడం, డబ్బు విత్ డ్రా చేయడంతో సైబర్ నేరగాళ్లకు పంపించేందుకు ప్రత్యేక నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు తేలిందని సీఎస్‌బీ ఆఫీసర్లు పేర్కొన్నారు. ప్రజలు తమ బ్యాంకు వివరాలను, ఓటీపీలను ఎవరికీ పంచుకోవద్దని.. అపరిచిత వ్యక్తులకు తమ అకౌంట్లను అద్దెకు ఇవ్వడం నేరమేనని అధికారులు హెచ్చరించారు.
