మన అప్పు లక్షా 54 వేల కోట్లే

మన అప్పు లక్షా 54 వేల కోట్లే

 

  •     అప్పులతోపాటు  ఆదాయం కూడా పెరిగింది
  •     కేంద్రం పెట్టే కండీషన్లకు తలొగ్గేది లేదు
  •     కోసిన జీతాల చెల్లింపుపై త్వరలో నిర్ణయం
  •     ఏజ్‌‌ పెంపు మెడికల్‌‌ టీచింగ్‌‌
  •     స్టాఫ్‌‌ కు మాత్రమేనని వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగురాష్ట్ర ప్రయోజనాల కోసమే తమ సర్కారు అప్పులు చేస్తోందని.. అప్పులతో పాటు ఆదాయం కూడా పెరిగిందని ఫైనాన్స్​ మినిస్టర్​ హరీశ్​రావు చెప్పారు. రాష్ట్ర అప్పు లక్షా 54 వేల 557 కోట్లుగా ఉందన్నారు. రాష్ట్రం కేంద్ర చట్టాలకు లోబడే అప్పులు తెచ్చుకోవాల్సి ఉంటుందని, సొంతంగా తెచ్చుకునే చాన్స్​ లేదని తెలిపారు. అయితే వివిధ కార్పొరేషన్లకు రాష్ట్ర సర్కారు గ్యారెంటీలు ఇస్తుందని చెప్పారు. గతంలో గ్యారెంటీల కింద రాష్ట్ర ఆదాయంలో 90 శాతం దాకా రుణం తెచ్చుకునే రూల్​ ఉండగా.. దాన్ని 200 శాతానికి పెంచామన్నారు. కరోనా ఎఫెక్ట్​తో ఫస్ట్ క్వార్టర్‌‌లో జాతీయ వృద్ధి రేటు ఎన్నడూ లేనట్టుగా మైనస్ -23.9 శాతం పడిపోయిందన్నారు. మళ్లీ పుంజుకోవాలంటే.. ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఖర్చు చేయాలన్నారు. అసెంబ్లీలో భట్టి విక్రమార్క అంకెల గారడీ చెప్పి, తాను అయోమయానికి గురై, సభను అయోమయానికి గురి చేస్తున్నారని కామెంట్​ చేశారు. సోమవారం అసెంబ్లీలో తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ బిల్, ఎఫ్‌‌ఆర్‌‌బీఎం, ప్రభుత్వ ఆయుర్వేద, యునానీ, నేచురోపతి మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పెంపు బిల్లులను హరీశ్​రావు ప్రవేశపెట్టారు. ఈ బిల్లులన్నీ ఆమోదం పొందాయి. వీటిపై చర్చ సందర్భంగా మంత్రి వివరణ ఇచ్చారు.

ఏటా అసలు, వడ్డీ కడ్తున్నం

రాష్ట్ర జీఎస్‌‌డీపీ 2014కు ముందు 4 లక్షల 52 వేల కోట్లు ఉంటే.. ఇప్పుడు 11 లక్షల 5 వేల 349 కోట్లు ఉందని.. అంటే రెండున్నర రెట్లు పెరిగిందని హరీశ్​రావు చెప్పారు. కేవలం అప్పు పెరుగుతోందని మాట్లాడుతున్నారని, పెరిగిన ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం జాతీయ జీడీపీ 3 శాతానికి తగ్గిపోగా.. రాష్ట్ర వృద్ధిరేటు 12.6 శాతంగా ఉందని చెప్పారు. రిజర్వుబ్యాంకు నివేదిక ప్రకారం అప్పుల్లో తెలంగాణ చివరి నుండి రెండో స్థానంలో ఉందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన పంజాబ్‌‌లో 39.9 శాతం, రాజస్థాన్ లో 33.6 శాతంగా అప్పులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఏటా అప్పులు తీసుకోవడంతో పాటు అసలు, వడ్డీ చెల్లిస్తున్నామని వివరించారు. ఐదేండ్లలో 34 వేల 296 కోట్లు చెల్లించామని.. అవి తీసేస్తే రాష్ట్ర అప్పు లక్షా 54 వేల 557 కోట్లుగా ఉందని తెలిపారు. ఎఫ్ఆర్​బీఎం పరిమితిని పెంచేందుకు కేంద్రం పెట్టే కండిషన్లకు తలొగ్గేది లేదని చెప్పారు.

కట్​ చేసిన జీతాల చెల్లింపు సీఎం పరిశీలనలో..

కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్​ కారణంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ ఆర్డినెన్స్ తెచ్చామని హరీశ్​రావు చెప్పారు. ఏప్రిల్‌‌లో రాష్ట్ర సొంత ఆదాయం 577 కోట్లు మాత్రమే వచ్చిందన్నారు. కోత పెట్టిన మేర వేతనాలను రానున్న రోజుల్లో చెల్లిస్తామని, ఇది సీఎం కేసీఆర్​ పరిశీలనలో ఉందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వివరించారు. జీతాల్లో కట్​ చేసిన డబ్బులు ఎప్పటిలోగా చెల్లిస్తారని సీఎల్పీ నేత భట్టి అడిగిన ప్రశ్నకు హరీశ్​ ఈ వివరణ ఇచ్చారు.

ఏజ్‌‌ పెంపు మెడికల్‌‌ టీచింగ్‌‌ స్టాఫ్‌‌కే..

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల రిటైర్మెంట్​వయసును 58 నుంచి 65 ఏండ్లకు పెంచామని హరీశ్​ తెలిపారు. చాలా మంది ప్రొఫెసర్లు రిటైర్మెంట్ కు దగ్గర్లో ఉన్నారని, సరైన ఎక్స్​పర్టులు దొరక్కపోవడంతో వారి సేవలనే ఇంకొన్నాళ్లు వినియోగించుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వ ఆయుర్వేద, యునానీ, నేచురోపతి మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ల రిటైర్మెంట్​ వయసు పెంపు బిల్లుపై చర్చలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. రిక్రూట్​మెంట్‌‌పై కోర్టుల్లో స్టేలున్నాయని.. సీట్లు కోల్పోకుండా, స్టూడెంట్లకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు టీచింగ్ స్టాఫ్‌‌కు మాత్రమే వయో పరిమితి పెంచామని తెలిపారు. అంతకు ముందు బిల్లుపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం మాత్రం రిటైర్మెంట్​ ఏజ్​పెంచుతోందని విమర్శించారు.