
- మోదీ ముందు ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ అధికారులు
- నేడు ప్రధాని అధ్యక్షతన ప్రగతి మీటింగ్
- బనకచర్లతో రాష్ట్రానికి కలిగే నష్టాన్ని వివరించే చాన్స్
- పీపీఏ, జీఆర్ఎంబీ అభ్యంతరాలను ప్రధాని ముందు పెట్టే అవకాశం
- పోలవరం ముంపు సమస్యపైనా అభ్యంతరాలు
- గతంలో పోలవరం అంశం 2 సార్లు ఎజెండా నుంచి ఎత్తివేత
హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న పోలవరం– బనకచర్ల (పీబీ) లింక్ప్రాజెక్ట్పై అభ్యంతరాలను ప్రధాని మోదీ ముందు లేవనెత్తేందుకు రాష్ట్ర సర్కారు యోచిస్తున్నది. కొద్దిరోజుల క్రితమే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్పాటిల్సమక్షంలో రెండు రాష్ట్రాల సీఎంల మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. సమావేశంలో భాగంగా కృష్ణా జలాల వివాదంతోపాటు బనకచర్ల ప్రాజెక్టుపైనా కేంద్రం నేతృత్వంలో రెండు రాష్ట్రాల అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. అయితే, తాజాగా బనకచర్ల అంశంపై ప్రధాని వద్ద చర్చించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
బుధవారం సాయంత్రం ప్రధాని నేతృత్వంలో మరోసారి ప్రగతి మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మరోసారి పోలవరం ప్రాజెక్టునే తొలి ఎజెండాగా పెట్టినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టుపై చర్చిస్తే.. బనకచర్ల ప్రాజెక్టు మీద ఏపీ తీరుపై ప్రధాని ముందు ప్రశ్నించే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.
పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే తెలంగాణతో పాటు ఒడిశా, చత్తీస్గఢ్కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. అసలు బనకచర్ల ప్రాజెక్టు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించేందుకు అవకాశం ఉందని తెలిసింది. బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రానికి కలిగే నష్టాలను వివరించనున్నట్టు సమాచారం. బనకచర్లపై పీపీఏ, జీఆర్ఎంబీల అభిప్రాయాలనూ ప్రధాని మోదీకి మన అధికారులు వివరించే అవకాశముంది. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే అధికారులు ప్రధాని ముందు వివరించే అంశాలపై ఎజెండాను సిద్ధం చేసి పెట్టారు.
అసలు చర్చ ఉంటుందా? ఉండదా?
పోలవరం ప్రాజెక్టుపై గత ప్రగతి మీటింగుల్లోనే చర్చించాల్సి ఉన్నా.. మీటింగ్‌నుంచి ఆ ఎజెండాను కేంద్రం ఎత్తేసింది. మే 28, జూన్ 25న నిర్వహించిన మీటింగులలోనే పోలవరం ముంపు ప్రభావం, పునరావాసం, రాష్ట్రాల అభ్యంతరాలపై చర్చించాల్సి ఉన్నది. అయితే, తొలిసారి మే 28న పెట్టిన మీటింగ్‌నుంచి.. రెండు రోజుల ముందు పోలవరం అంశాన్ని ఎజెండా నుంచి కేంద్రం ఎత్తేసింది. ఆ తర్వాత జూన్ 25న జరిగిన మీటింగ్‌లోనూ పోలవరాన్ని ఎజెండాగా పెట్టినా.. తీరా మీటింగ్‌కు 2 గంటల ముందు తొలగించారు.
ఈ నేపథ్యంలోనే బుధవారం నిర్వహించనున్న మీటింగ్‌లోనైనా పోలవరం అంశాన్ని చర్చిస్తారా? ఇంతకు ముందు తొలగించినట్టే ఎజెండాను ఎత్తేస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రెండు సార్లు ఏపీ ప్రభుత్వ ఒత్తిడి, చంద్రబాబు జోక్యంతో పోలవరం అంశాన్ని ఎజెండా నుంచి ఎత్తేశారన్న చర్చ జోరుగానే సాగింది. మరి, ఇప్పుడైనా ప్రాజెక్టు పురోగతిపై ప్రధాని మోదీ ఎంత వరకు చర్చిస్తారన్నది ప్రశ్నార్థకంగానే మిగిలింది. అయితే, మీటింగ్‌లో పోలవరం అంశాన్ని చర్చిస్తే కచ్చితంగా బనకచర్లపైనా ప్రశ్నించాలని అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
అందరి అభిప్రాయాలతో నోట్ రెడీ..
ప్రగతి మీటింగ్‌లో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే అధికారులు నోట్‌ను సిద్ధం చేసి పెట్టారు. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటిదాకా ఏపీ, సీడబ్ల్యూసీ, కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, అభ్యంతరాలతో వివరాలను అధికారులు తయారుచేశారు. నాలుగు ప్రధాన అంశాల వారీగా ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 21 వరకు వివిధ దశల్లో జరిగిన కమ్యూనికేషన్ వివరాలను తయారు చేశారు.
పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలోని 950 ఎకరాలు ముంపునకు గురవుతాయని, దాంతోపాటు గోదావరి నదీ పరివాహకంలోని చిన్న నదులు, వాగులు పొంగుతాయని మరోసారి గుర్తు చేయనున్నారు. ఏప్రిల్ 8న జరిగిన పీపీఏ మీటింగ్‌లో సీడబ్ల్యూసీతో జాయింట్ సర్వే చేయించేందుకు అంగీకరించారని ప్రధానికి వివరించేందుకు సిద్ధమయ్యారు. పోలవరం ప్రాజెక్టుతో నష్టపోతున్న ముంపు ప్రాంతాల ప్రజలకు పునరావాస ప్యాకేజీపై జాయింట్ సర్వే తర్వాతనే తేల్చాలని ఇప్పటికే సీడబ్ల్యూసీకి తెలంగాణ తేల్చి చెప్పింది.
చత్తీస్‌గఢ్, ఒడిశా అభ్యంతరాలపైనా..
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినట్టు ఏపీ వాదిస్తున్నా.. ఒడిశా, చత్తీస్‌గఢ్ మాత్రం లేదని చెబుతున్నాయి. తమ రాష్ట్రాల్లోనూ ఏర్పడే ముంపుపై ప్రజాభిప్రాయసేకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. మే 20న ఆ రెండు రాష్ట్రాలూ కేంద్రానికి రాసిన లేఖలనూ ప్రగతి మీటింగ్‌లో తెలంగాణ అధికారులు ప్రస్తావించే అవకాశం ఉన్నది. ఇప్పటికే తమ రాష్ట్రంలో ప్రాజెక్ట్ సర్వే చేపట్టామని, అది పూర్తికాగానే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని ఒడిశా చెబుతున్నది.
ముంపు సమస్యపై ఐఐటీ ఖరగ్‌పూర్‌తో సర్వే చేయిస్తున్నామని, అనంతరం పబ్లిక్హియరింగ్చేపడుతామని చత్తీస్గఢ్అంటున్నది. అయితే, మనకు సంబంధించినంత వరకు ఇప్పటిదాకా ఎలాంటి పునరావాస హామీలూ దక్కలేదని, భద్రాద్రి జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ చేశామని కేంద్రం చెబుతున్నా అది సమర్థంగా.. సమగ్రంగా లేదని మన అధికారులు స్పష్టం చేస్తున్నారు.
జాయింట్ సర్వే తర్వాత సమగ్రమైన ప్రజాభిప్రాయసేకరణ చేపట్టాలని డిమాండ్చేస్తున్నారు. గోదావరి ట్రిబ్యునల్అవార్డును అనుసరించి ముందుకు వెళ్తే బాగుంటుందని తేల్చి చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టులోనే ఇన్ని అపరిష్కృత సమస్యలున్నప్పుడు బనకచర్ల లింక్‌ను చేపడతామనడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రధాని మోదీ ముందు అధికారులు వివరించే అవకాశం ఉందని తెలుస్తున్నది.