మిడ్జిల్ పాఠశాల ఘటనపై  విద్యా కమిషన్ సీరియస్ : విద్యా కమిషన్ మెంబర్ చార గొండ వెంకటేశ్

మిడ్జిల్ పాఠశాల ఘటనపై  విద్యా కమిషన్ సీరియస్ : విద్యా కమిషన్ మెంబర్ చార గొండ వెంకటేశ్
  •     ఎంక్వయిరీలో హెచ్ఎం వీరంగం
  •     సర్దిచెప్పిన స్థానిక లీడర్లు 

 మిడ్జిల్, వెలుగు : మిడ్జిల్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ టీచర్లు బుధవారం పాఠశాల సమయంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన ఘటనపై తెలంగాణ విద్యా కమిషన్ మెంబర్ చారగొండ వెంకటేశ్, డీఈఓ రవీందర్‌‌‌‌‌‌‌‌తో కలిసి గురువారం విచారణ చేపట్టారు. జరిగిన సంఘటనపై కమిషన్ మెంబర్ సీరియస్ అయ్యారు. ఎంక్వయిరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ పాఠశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’గా మారుస్తామని హామీ ఇచ్చారు. టీచర్లు స్థానిక నాయకులతో సహకరించుకొని  అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.

కాగా, విచారణ జరుగుతుండగానే పాఠశాల టీచర్​ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. తనపై అసత్య ఆరోపణలు చేశాడన్న కోపంతో హెచ్ఎం, సహచర టీచర్​ను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించడం అక్కడ కలకలం రేపింది. స్థానికులు, అధికారులు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శంకర్ నాయకులు వెంకటయ్య, సాయిలు, రామ్ గౌడ్, రమేశ్, పర్వతాలు ఉన్నారు.