నూతన విద్యా సంస్కరణలు తేవాలి!

నూతన విద్యా సంస్కరణలు తేవాలి!

విద్య అనేది ఒక స్థిరమైన వ్యవస్థ కాదు అది కాలానుగుణంగా మారే ప్రక్రియ.  సమాజం, సాంకేతికత, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగవకాశాలు, జీవనశైలులు మారుతుంటే విద్యావిధానాలు కూడా మారాలి. ఈ మార్పులే విద్యా సంస్కరణలు.  అవి తక్షణ ఫలితాలు ఇవ్వకపోయినా,  దీర్ఘకాలంలో ఆలోచనా ధోరణులు, నైపుణ్యాలు, ఆర్థికాభివృద్ధి, సామాజిక సమానత్వాన్ని  ప్రభావితం చేస్తాయి. కాబట్టి,  ప్రతి విద్యా సంస్కరణను జాతీయ నిర్మాణ యజ్ఞంగా పరిగణించాలి.  సుస్థిరమైన  విద్యా వ్యవస్థతోనే  దేశ ఆర్థిక బలం, ప్రజాస్వామ్య స్థిరత్వం, సామాజిక న్యాయం సాధ్యమవుతాయి.  రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ విద్యారంగం నిర్మాణాత్మక, ఆర్థిక, నాణ్యతాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.  

గ త  కేసీఆర్ ప్రభుత్వం విద్యపై  చేసిన  నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గడం,  ఉన్నతవిద్యలో  ఫీజు  రీయింబర్స్​మెంట్​ ఆలస్యం, వృత్తివిద్యలో పరిశ్రమల అనుసంధానం లేకపోవడం వంటి సమస్యలు తీవ్రమయ్యాయి. అందువల్ల విద్యా సంస్కరణలు తెలంగాణ భవిష్యత్తును మలిచే ప్రధాన శక్తిగా మారాలి.  సమగ్ర దృష్టితో ఈ సంస్కరణలు కొనసాగితే తెలంగాణ విద్యా నాణ్యతలో ఒక ‘మోడల్ రాష్ట్రం’గా నిలుస్తుంది. 

మొదటి అడుగు ‘విశ్వవిద్య’ వైపు..

కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం విద్యాశాఖను  తనదగ్గరే ఉంచుకుని తనదైన ముద్రతో బాధ్యతగా  ఉన్నత విద్యా వ్యవస్థ పునరుద్ధరణను ప్రధాన ప్రాధాన్యంగా నిర్ణయించారు. అందులో మొదటి అడుగు రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పూర్తిస్థాయి ‘వైస్ చాన్సలర్ల’ నియామకాలు.  కేసీఆర్ పాలనలో నిర్వీర్యమైన విశ్వవిద్యాలయాలకు  రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త శ్వాస నింపింది. వైస్ చాన్సలర్ల నియామకాలలో ఆయన తీసుకున్న పారదర్శక, ప్రతిభాపర, సామాజిక సమతౌల్య విధానం విద్యావ్యవస్థకు స్థిరత్వం, నమ్మకం, నాణ్యతను తిరిగి అందించింది.కేసీఆర్ పాలన ఒకవైపు రాష్ట్ర విశ్వవిద్యాలయాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ, అత్యవసరం కాకపోయినా ‘10 ప్రైవేట్ యూనివర్సిటీలకు’ అనుమతులిచ్చింది.అందులో ‘ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల’ అమలుకు ప్రత్యేక చట్టం తెస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. 

విప్లవాత్మక మార్పు కోసం ‘విద్యా కమిషన్’ 

తెలంగాణలో ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయాల వరకు అన్నిస్థాయిల విద్యా విధానాల సమన్వయం, మానిటరింగ్, పరిశోధన ఆధారిత నిర్ణయాల సమగ్ర వ్యవస్థ పర్యవేక్షణ కోసం ‘నూతన విద్యా కమిషన్’ ను ఏర్పాటు చేయడం ద్వారా   విద్యా నాణ్యత సూచీలు సాధ్యమవుతాయని భావించి రేవంత్  ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుని కమిషన్ ను ఏర్పాటు చేసింది.  ప్రధానంగా మూడు వేర్వేరు శాఖలైన పాఠశాల, ఇంటర్మీడియట్,  ఉన్నతవిద్యల మధ్య  సమన్వయం సాంకేతికంగా  క్లిష్టంగా ఉంది.  దీనిద్వారా సమగ్ర సమీక్ష,  డేటా  ఆధారిత నిర్ణయాలు,  ఫలితాధారిత పాలసీల తయారీలాంటి ప్రయోజనం కూడా కలుగుతుంది. తెలంగాణ విద్యా కమిషన్  ఏర్పాటుతో  రాష్ట్ర విద్యా విధానానికి కొత్త దిశ లభించినట్లు భావించాలి. 

నూతన యూనివర్సిటీల ఏర్పాటు దిశగా..

ఉన్నత  విద్యా వనరుల పెంపులో భాగంగా చదువులతల్లి సరస్వతీదేవి కొలువై ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్,  ఖమ్మం జిల్లాలలో నూతన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.  ప్రణాళికల తయారీకి  ఉన్నత విద్యాశాఖకు ఆదేశాలు జారీచేసి ఖమ్మంలో మైనింగ్ కళాశాల ఉన్నతీకరణతో  డా. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని స్థాపించారు. ఉమ్మడి అదిలాబాద్​లో ఏర్పాటుకు ‘ఆర్థిక వనరుల లేమి’ వల్ల ఆలస్యం  కొనసాగుతోంది. ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ ఏర్పాటుకోసం త్వరితగతిన సన్నాహాలు చేసి తెలంగాణ  ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి మార్గం  సుగమం చేసింది.

నాసిరకం విద్యాసంస్థలపై కఠిన చర్యలు 

రాష్ట్రంలోని వివిధ ఉన్నత విద్యా సంస్థలు ప్రభుత్వ ఆదేశాలు,  నిబంధనలకు అనుగుణంగా ఉండాలని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి రూ. వేలకోట్ల  ఫీజు రీయింబర్స్​మెంట్ పొందుతూ నాసిరకం విద్యను అందిస్తున్న అనేక సంస్థలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ క్రమంలో కళాశాలల్లో  ‘విజిలెన్స్ తనిఖీలు’ చేపట్టేందుకు ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి.  నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్న విద్యాసంస్థలు ఈ తనిఖీలను స్వాగతిస్తున్నప్పటికీ,  నాణ్యతలేని విద్యా సంస్థలు మాత్రం ఈ చర్యను జీర్ణించుకోలేకపోతున్నాయి. 

ప్రతి ఏడాది సంబంధిత విశ్వవిద్యాలయాలు అఫిలియేషన్ గుర్తింపుల నిమిత్తం ఈ కళాశాలలను తనిఖీ చేయాల్సి ఉన్నా, అవి కేవలం తూతూ మంత్రంగానే కొనసాగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఇకపై నిబంధనలను ఉల్లంఘించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం విదితమే.

 ప్రాథమిక స్థాయి నుంచే ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’ విషయ  బోధనను  ప్రవేశపెట్టి,  విద్యార్థులను  భవిష్యత్తు సాంకేతిక అవకాశాలకు  సిద్ధం చేస్తోంది.  ప్రభుత్వం ప్రీ-ప్రైమరీ స్థాయి నుంచే ‘ఇంగ్లీష్‌ మాధ్యమ’ పాఠశాలలను ప్రారంభించి  తెలంగాణలో విద్యను గ్లోబల్‌ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. 

‘విద్యావిధాన పత్రం’ రూపకల్పనలో..

ప్రభుత్వం  విద్యను ప్రజా హక్కుగా అభివృద్ధి చేసి, అందరికీ నాణ్యమైన,   ఆచరణాత్మక విద్యను అందించడం,  ఉపాధి అవకాశాలు పెంచడం, సమాజాభివృద్ధికి బాట వేయడం లక్ష్యంగా సీఎం  రేవంత్ ఆదేశాలతో నూతన ‘విద్యా విధాన పత్రం’ రూపకల్పనకు చర్యలు చేపడుతోంది.  విద్యను శక్తిమంతమైన సాధనంగా మార్చి,  ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించడానికి అధికారిక పత్రంగా ‘నూతన విద్యా విధానపత్రం’  రూపొందించడం అత్యవసరం అని భావించింది. 

ఇది విద్యారంగ లక్ష్యాలు, విధానాలు,  అమలు ప్రణాళికలను సమన్వయంగా ప్రతిపాదిస్తూ  ప్రభుత్వ విద్యావ్యవస్థను నూతన దిశలో  తీర్చిదిద్దడానికి మార్గదర్శిగా నిలుస్తుంది. దీని తయారీలో రాష్ట్ర  ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా నూతన జాతీయ విద్యావిధానంలోని ఉత్తమ అంశాలను అనుసరించడం సముచితం.

- నంగె శ్రీనివాస్,  ఎడ్యుకేషనల్ ఎనలిస్ట్