
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 21న బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పేపర్ యాడ్స్‌పై కాంగ్రెస్ నేతలు సీఈవో వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. శనివారం నాటి పేపర్లలోనూ బీఆర్ఎస్ ఇచ్చిన ప్రకటనలు కాంగ్రెస్ ప్రతిష్టను భంగపరిచేలా ఉన్నాయని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్లలోనూ గందరగోళం నెలకొందని ఫిర్యాదు చేశారు. అనంతరం పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న బీఆర్ఎస్ యాడ్స్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులను ఆర్వోలు రిజెక్ట్ చేస్తున్నారని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై జిల్లాల్లో ఆందోళనలు జరుగుతున్నాయని తెలిపారు. బూత్ లెవల్ ఆఫీసర్స్ కూడా ఓటర్ స్లీప్పులు పంపిణీ చేయడం లేదన్నారు. బ్యాలెట్ పేపర్లలో స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు సరిగ్గా ఉండేలా చూడాలని ఆయన కోరారు.