
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ సిటీకి తూర్పున ఆంధ్ర ముఖద్వారమైన ఎల్బీనగర్ సెగ్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా ఉంది. సెగ్మెంట్ ఏర్పాటైనప్పటి నుంచి కాంగ్రెస్ తన హవా కొనసాగిస్తున్నది. ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ చేరి, మరోసారి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు.
కాంగ్రెస్ నుంచి రాష్ట్ర స్థాయి నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ బరిలోకి దిగారు. బీజేపీ నుంచి సామ రంగారెడ్డి పోటీలో ఉన్నారు. సెగ్మెంట్ లో మొత్తం 11 డివిజన్లు ఉండగా, ఇందులో 10 డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. కమలం పార్టీకి ఇదే పెద్ద బలమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇక్కడ లక్షకుపైగా సెటిలర్ల ఓట్లు ఉండగా.. వారే గెలుపు ఓటములను డిసైడ్ చేస్తారు. ఏ పార్టీ అభ్యర్థి తమకు అనుకూలంగా సెటిలర్ ఓట్లను మార్చుకుంటే గెలుపు ఈజీగా ఉంటుంది.
బీసీలే ఎక్కువ మంది..
గతంలో ఎల్ బీనగర్ సెగ్మెంట్మలక్పేట్ పరిధిలో ఉండేది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎల్బీనగర్ కొత్తగా ఏర్పాటైంది. 11 డివిజన్లతో పాటు రంగారెడ్డి జిల్లాలో భాగంగా సెగ్మెంట్ ఉంది. మల్కాజ్‌గిరి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోకి ఎల్బీనగర్ వస్తుంది. ఇక్కడ రెడ్లు 40 నుంచి 50 వేలు, గౌడ్లు 50 నుంచి 60 వేలు, ఎస్సీలు 60 వేలు, యాదవ, కురుమలు 25వేలు, ఎస్టీలు 15వేలు, క్రిస్టియన్లు 15వేలు, వైశ్యులు, బ్రాహ్మణులు 15వేలు, కమ్మలు 10వేల మంది ఓటర్లు ఉండగా.. రాష్ట్రంలోనే అత్యధికంగా బీసీలు ఇక్కడే ఉన్నారు.
ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం
సెగ్మెంట్ పరిధిలో కాంగ్రెస్కు సొంత క్యాడర్ ఉండటం అభ్యర్థికి కలిసొస్తుందనే చర్చ నడుస్తుంది. బీజేపీ, బీఆర్ ఎస్ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థి బీసీ నినాదంతో ప్రచారంలో ముందుకెళ్తున్నారు. 2014లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య గెలుపొందారు. ఈసారి అదే వర్ అవుట్ అవుతుందనే ధీమాను కాంగ్రెస్నేతలు వ్యక్తం చేస్తున్నారు.
లింగోజీగూడ కార్పొరేటర్ కాంగ్రెస్కు చెందినవారు. బీజేపీకి కూడా గట్టి పట్టు ఉండడం అభ్యర్థికి కలిసి రానుంది. అయితే..ఈసారి ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉంది. దీంతో ఆ పార్టీ క్యాడర్ పై అన్ని పార్టీల అభ్యర్థులు దృష్టి పెట్టారు. ఇక్కడ టీడీపీ ఓట్లే చాలా కీలకం. ఈసారి కొందరు టీడీపీ నేతలు కాంగ్రెస్కు సపోర్టు చేస్తున్నారు.
బీఆర్ఎస్ తొలిసారి గెలిచేందుకు..
అధికార బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఒక్కసారి కూడా గెలవలేదు. 2009లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014లో టీడీపీ నుంచి ఆర్. కృష్ణయ్య విజయం సాధించారు. 2018లో కాంగ్రెస్, టీడీపీ పొత్తులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి టికెట్ దక్కించుకుని గెలిచారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ఓడిపోయారు.
మొన్నటి వరకు బీఆర్ఎస్ పరిస్థితి వర్గవిబేధాలతో దారుణంగా మారింది. రామ్మోహన్ గౌడ్ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్చేరారు. మంత్రి హరీశ్ మంతనాలు చేయడంతో తిరిగి సొంతగూటికి చేరారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి కలిసి మద్దతు కోరారు. అయినా రామ్మోహన్ వర్గం ఎంతవరకు సపోర్టు చేస్తుందనేది సస్పెన్స్ గా ఉంది.