డబ్బులు, మద్యం పంచుతున్నరు

డబ్బులు, మద్యం పంచుతున్నరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా చూడాలని గవర్నర్ తమిళి సైని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక కోరింది. బుధవారం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైకి వేదిక నిర్వాహకులు, సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, మామిడి సోమయ్య, ఆనం చిన్ని వెంకటేశ్వరరావుతోపాటు పలువురు వినతిపత్రం అందచేశారు.

ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బు, మద్యం పంచుతున్నారని, పోలీస్ వెహికల్స్ లో అధికార పార్టీ అభ్యర్థులు డబ్బులు తరలిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెండ్లీలు, ఇతర పనుల నిమిత్తం సాధారణ ప్రజలు తీసుకెళ్తున్న డబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారని ఆమె దృష్టికి తెచ్చారు. పోలింగ్​టైమ్​లో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని, అలాంటివి జరుగకుండా చూడాలని కోరారు. కొల్లాపూర్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి శిరీష (బర్రెలక్క) తమ్ముడిపై  దాడి చేశారని, ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గవర్నర్​ను కోరారు.

పూర్తి వివరాలు తెప్పించుకుని చర్యలు తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారని పాశం యాదగిరి తెలిపారు. శిరీషకు భద్రత కల్పించాలని కూడా గవర్నర్​ను కోరామన్నారు. అదే విధంగా హైదరాబాద్​లో ఫోటో గ్రాఫర్​పై చానెల్​ రిపోర్టర్ కర్రతో దాడి చేసిన విషయంతోపాటు ముషీరాబాద్ లో రిపోర్టర్ ఉరి వేసుకున్న ఘటనను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు.