కాంగ్రెస్​ ఆశావహుల్లో ఉత్కంఠ : అభ్యర్థుల లిస్టు కోసం ఎదురుచూపులు

కాంగ్రెస్​ ఆశావహుల్లో ఉత్కంఠ : అభ్యర్థుల లిస్టు కోసం ఎదురుచూపులు
  •     కామారెడ్డి అభ్యర్థిగా షబ్బీర్​అలీ?
  •     మిగిలిన మూడు స్థానాల్లో అభ్యర్థుల వడపోత
  •     టికెట్​తమకేనని లీడర్ల ధీమా

కామారెడ్డి, వెలుగు:వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడానికి కాంగ్రెస్​ పార్టీ స్ర్కీనింగ్​క మిటీ వరుస భేటీలు నిర్వహిస్తోంది. ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులను సెలక్ట్​ చేసేందుకు కాంగ్రెస్​ ముఖ్యనేతలు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. దీంతో కామారెడ్డి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్​ఆశిస్తున్న ఆశావహులతో పాటు క్యాడర్​లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కామారెడ్డిలో మాజీమంత్రి షబ్బీర్​అలీకి దాదాపు టికెట్​ఖాయమైందని, మిగిలిన మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కావాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్​ఆశిస్తున్న నేతలు తమ గాడ్​ ఫాదర్స్​ను కలిసి తమకు అవకాశం ఇప్పించాలని కోరుతున్నారు. హైదరాబాద్, ఢిల్లీ స్థాయుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్​ఆశిస్తున్న నేతల నుంచి కాంగ్రెస్​ పార్టీ ఆగస్టులో అప్లికేషన్లు స్వీకరించింది. 

అదే నెల చివరి వారంలో హైదరాబాద్​లో స్ర్కీనింగ్​కమిటీ సమావేశమై అప్లికేషన్లపై చర్చించింది. పోటీ తక్కువగా ఉన్న చోట, ముఖ్యనేతలు టికెట్​ఆశిస్తున్న నియోజవర్గాలకు సంబంధించి అప్లికేషన్లు వడపోసి నియోజకవర్గానికి ఒకటి, రెండు పేర్లను, పోటీ ఎక్కువగా ఉన్న చోట 3 పేర్లను ఢిల్లీకి పంపారు. అభ్యర్థుల ఎంపిక కోసం స్ర్కీనింగ్​ కమిటీ సభ్యులు ఢిల్లీలో మూడు రోజులుగా వరుసగా భేటీ అయ్యారు. దీంతో టికెట్లు ఆశిస్తున్న నేతలు పార్టీలో తాము నమ్ముకున్న ముఖ్య నేతల ద్వారా టికెట్​కోసం పైరవీలు చేస్తున్నారు.

ఆ  మూడు నియోజకవర్గాల్లో..

ఎల్లారెడ్డి నుంచి నలుగురు టికెట్​ కోసం అప్లయ్​చేసుకున్నారు. ఇక్కడ  కె.మదన్​మోహన్​రావు, వడ్డేపల్లి సుభాష్​రెడ్డి టికెట్​కోసం పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలో వేర్వేరుగా సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టికెట్ కోసం వీరిద్దరూ తాము నమ్ముకున్న ముఖ్యనేతల ద్వారా ప్రయత్నిస్తున్నారు. జుక్కల్​ నియోజకవర్గంలో ఎనిమిది మంది అప్లయ్​ చేసుకోగా స్ర్కీనింగ్​ కమిటీ ముగ్గురి పేర్లను ఫైనల్​ చేసి అధిష్టానానికి పంపింది. మాజీ ఎమ్మెల్యే సౌదగర్ గంగారాం, ఎన్ఆర్ఐ లక్ష్మీకాంత్​రావు, మరో నేత గడుగు గంగాధర్​ పేర్లు ఉన్నాయి. బాన్సువాడలో టికెట్​కోసం 16 మంది అప్లయ్​ చేసుకున్నారు.  

ఇందులో ముగ్గురు పేర్లు అధిష్టానవర్గానికి పంపారు. గతంలో పోటీ చేసిన ఓ లీడర్​తో పాటు మరో ఇద్దరు నేతల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్​కు అప్లయ్​ చేసుకున్న లీడర్లు ఇటీవల నియోజకవర్గంలో మీటింగ్​లు నిర్వహించారు. అప్లికేషన్​ పెట్టిన ఎనిమిది మంది బాన్సువాడ లో మీటింగ్​ ఏర్పాటు చేసి, తమలో ఎవరికి టికెట్​ఇచ్చిన కలిసికట్టుగా ముందుకెళ్లాలని తీర్మానించుకున్నారు. గతంలో పోతీ చేసిన మరో లీడర్​ బీర్కూర్ మండలంలో మీటింగ్​ నిర్వహించారు. ఇక్కడ బీఆర్ఎస్​ నుంచి స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి పోటీ చేయనుండగా, ఆయనపై బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలని పార్టీ హైకమాండ్​ సమాలోచనలు చేస్తోంది.

సీఎంపై పోటీకి షబ్బీర్​అలీ ఫైనల్!

కామారెడ్డి నుంచి మాజీ మంత్రి, పార్టీ సీనియర్​నేత షబ్బీర్​అలీ పేరు ఫైనల్ ​అయినట్లు చెబుతున్నారు. ఇక్కడి నుంచి టికెట్ ​ఆశిస్తున్న వారిలో ఈయన ముఖ్యనేత. ఈయనతో పాటు, హైదరాబాద్​కు చెందిన రాజు అనే వ్యక్తి అప్లికేషన్ ​పెట్టారు. పార్టీ ముఖ్య నేతలు ఇక్కడి నుంచి అధిష్టానానికి పంపిన లిస్టులో షబ్బీర్​అలీ ఒకరి పేరే ఉంది. ఫస్ట్ లిస్ట్​లో షబ్బీర్​అలీ పేరు ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక్కడి నుంచి బీఆర్ఎస్​ తరఫున సీఎం కేసీఆర్​ పోటీ చేయనుండడం ఆసక్తి రేపుతోంది.