- నాలుగు నెలల్లో వివిధ ఫామ్ల కింద10 లక్షలకు పైగా దరఖాస్తులు
- ఫామ్6 కింద కొత్త ఓట్ల కోసం 4.88 లక్షల అప్లికేషన్లు
- నవంబర్ 9న తుది ఓటర్ల జాబితా
హైదరాబాద్, వెలుగు: సర్ ప్రక్రియలో భాగంగా మరణించినవారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, ఒకే పేరుతో రెండు చోట్ల నమోదైన ఓటర్ల తొలగింపు కోసం ఫామ్–7 కింద మొత్తం 24,323 అభ్యంతరాలు వచ్చాయి. వీటిపై ఎన్నికల సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన అనంతరం 12,204 ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఈ మేరకు 2026 జూన్ 15 నుంచి అక్టోబర్ 7 వరకు కొనసాగిన సర్ ప్రక్రియ గణాంకాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. మొత్తం నాలుగు నెలల్లో వివిధ ఫారాల కింద 10,23,792 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో ఫామ్–7 విషయానికి వస్తే పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా 1,737 దరఖాస్తులు రాగా, 1,332 ఓట్లను తొలగించారు. వీటిలో ఒక్క రామగుండం నియోజకవర్గంలోనే అత్యధికంగా 1,241 తొలగింపులు నమోదయ్యాయి. హైదరాబాద్ జిల్లాలో అందిన 6,335 తొలగింపు దరఖాస్తుల్లో 2,066 ఓట్లు తొలగించారు. ఈనెల 7తో క్లెయిములు, అభ్యంతరాల గడువు ముగియడంతో మిగిలిన దరఖాస్తులను పరిష్కరించి, నవంబర్ 9న తుది జాబితాను ప్రచురించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
హైదరాబాద్ లో అత్యధికంగా 1,94,204 దరఖాస్తులు
రాష్ట్రవ్యాప్తంగా యువత, అర్హులైన పౌరుల నుంచి కొత్త ఓట్ల కోసం ఫామ్–6 కింద మొత్తం 4,88,417 దరఖాస్తులు అందగా, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఇప్పటివరకు 51,821 మంది పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చినట్లు తెలిపారు. మిగిలిన సుమారు 4.36 లక్షల దరఖాస్తులు ప్రస్తుతం పరిశీలన దశల్లో ఉన్నాయి. కొత్త ఓటర్ల నమోదు కోసం అందిన దరఖాస్తుల్లో సింహభాగం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు ప్రధాన పట్టణ జిల్లాల నుంచే వచ్చాయి. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా 1,94,204 ఫామ్–6 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు అధికారులు 29,226 మందిని జాబితాలో చేర్చారు. రంగారెడ్డి జిల్లాలో 74,375 దరఖాస్తులు నమోదు కాగా, 6,206 మందికి ప్రాథమికంగా ఆమోదం లభించింది.
మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలో 64,863 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 386 మంది పేర్లు ఈ–రోల్‌లో నమోదయ్యాయి. ఓటర్ల వివరాల్లో తప్పుల సవరణ, ఫొటోల మార్పు, నియోజకవర్గ పరిధి మార్పుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫామ్ 8 కింద మొత్తం 5,04,782 దరఖాస్తులు అందగా, అందులో దాదాపు 45 శాతం, అంటే 2,27,721 దరఖాస్తులను అధికారులు పరిష్కరించి ఓటర్ల జాబితాలో మార్పులు చేశారు. హైదరాబాద్ జిల్లాలో అందిన 1.44 లక్షల ఫామ్–8 దరఖాస్తుల్లో 84,972 పరిష్కారం కాగా, మేడ్చల్–మల్కాజ్‌గిరిలో 65,414 దరఖాస్తులకు 34,292, రంగారెడ్డి జిల్లాలో 68,002 దరఖాస్తులకు 27,779 అప్లికేషన్ల పరిశీలన పూర్తి చేశారు. ఎన్నారై కోసం నిర్దేశించిన ఫామ్–6ఏ లో 6720 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 118 మందికి అధికారికంగా ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు.
ఫైనల్జాబితా టైంకు 2.68 కోట్ల ఓటర్లు..?
రాష్ట్రంలో సర్ప్రక్రియలో భాగంగా 2.64 కోట్ల మందితో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించారు. ఇందులో 92.88 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చి విచారణ సాగిస్తుండగా, ఇప్పటికే 74 లక్షల మంది ఎలిజిబుల్ఓటర్లుగా ఫైనల్చేశారు. మరో 19 లక్షల ఓటర్లను కూడా విచారించి ఫైనల్ చేయనున్నారు. కొత్తగా 4.88 లక్షల ఓటర్లు అప్లై చేసుకున్నారు. దీంతో అన్ని కలిపి తుది జాబితా నాటికి 2.67 కోట్ల నుంచి 2.68 మధ్యలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
