- సీఎస్‌కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ వినతి
- తమ వాటా తాము కడతామని వెల్లడి
- ప్రైవేట్ ఆస్పత్రుల్లో హెల్త్ కార్డులు చెల్లుబాటు కావడం లేదని ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులందరికీ తక్షణమే క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్ ను (ఈహెచ్‌ఎస్) పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. క్యాష్ లెస్ చికిత్స ఉద్యోగుల హక్కు అని ఆయన పేర్కొన్నారు. మంగళవారం సెక్రటేరియెట్ లో సీఎస్ రామకృష్ణారావును లచ్చిరెడ్డి నేతృత్వంలోని జేఏసీ బృందం కలిసి ఈహెచ్‌ఎస్ అమలుపై వినతిపత్రం అందజేసింది.
ఇందుకోసం ప్రభుత్వం ఇచ్చే వాటాతో సమానంగా ప్రతినెలా తమ జీతాల నుంచి వాటా (కాంట్రిబ్యూషన్) చెల్లించేందుకు తామఉ సిద్ధంగా ఉన్నామని జేఏసీ బృందం తెలిపింది. లచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం అమల్లో ఉన్న రీయింబర్స్‌మెంట్ విధానం ఉద్యోగులకు గుదిబండగా మారిందన్నారు. నగదురహిత వైద్యం కోసం మార్గదర్శకాలు ఉన్నా.. క్షేత్రస్థాయిలో కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు హెల్త్ కార్డులను అనుమతించడం లేదని సీఎస్ దృష్టికి తెచ్చారు. అత్యవసర సమయంలో అప్పులు తెచ్చి వైద్యం చేయించుకోవాల్సి వస్తోందని, తర్వాత బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని వెల్లడించారు.
ఉద్యోగులకు నగదురహిత వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఈహెచ్‌ఎస్‌ను రూపొందించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుండె, క్యాన్సర్, కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల సీలింగ్ సరిపోవడం లేదని, దీనివల్ల పూర్తి ఖర్చు రీయింబర్స్ కాక ఉద్యోగులపై భారం పడుతోందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఐపీ, ఓపీ చికిత్సలకు ఎలాంటి పరిమితి లేకుండా (అన్‌లిమిటెడ్) వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 10 లక్షల మందికి పైగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు తమ వాటా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌ను జతచేసి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు.జేఏసీ ప్రతిపాదనలపై సీఎస్ సానుకూలంగా స్పందించారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి తుది నివేదిక తెప్పించుకుని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎస్ ను కలిసిన వారిలో జేఏసీ లీడర్లు రామకృష్ణ, రమేష్ పాక, ఫూల్‌సింగ్ చౌహాన్, ఉపేందర్‌రావు ఉన్నారు.
