
- ఇప్పటికే ప్రతి సేవకు డిజిటల్ పేమెంట్స్ విధానం.. తొలుత ప్రధాన ఆలయాల్లో అమలు
- యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, బాసర ఆలయాల్లో క్యూఆర్ కోడ్లు
- కొత్త విధానంతో భక్తులకు మరింత సౌలభ్యం
- ఈసారి మేడారంలోనూ డిజిటల్ చెల్లింపులకు ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: దేవాలయాల్లో భక్తులకు మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆలయాల్లో అన్ని రకాల సేవలకు డిజిటల్ చెల్లింపుల(ఈ-–పేమెంట్స్) విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ-హుండీలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి సేవకు ప్రత్యేక డిజిటల్ అకౌంట్లను కూడా కేటాయించనుంది. ఈ నూతన విధానం ద్వారా లావాదేవీల వివరాలను సులభంగా తెలుసుకోవడానికి వీలు కానుంది. ప్రస్తుతం ఆలయాల్లో నగదు రూపంలో జరిగే లావాదేవీల్లో పారదర్శకత లోపిస్తోందన్న విమర్శలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపుల ద్వారా ప్రతీ పైసా లెక్క పక్కాగా ఉండేలా దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఈ-–హుండీల ద్వారా భక్తులు తమ కానుకలను నేరుగా డిజిటల్ రూపంలో సమర్పించవచ్చు. అలాగే, అభిషేకాలు, అర్చనలు, ప్రసాదాలు, పూజా టికెట్ల వంటి అన్నిరకాల సేవలకు ఆన్‌లైన్ ద్వారా చెల్లించే వెసులుబాటును దేవాదాయ శాఖ కల్పించింది.
ప్రధాన ఆలయాల్లో అమలు..
రాష్ట్రంలో 6,541కిపైగా ఆలయాలు ఉండగా 704 ప్రధాన ఆలయాలు ఉన్నాయి. అయితే, ఈ నూతన విధానాన్ని తొలుత ప్రధాన ఆలయాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. వీటిలో విజయవంతమైన తర్వాత దశలవారీగా అన్ని ఆలయాలకు విస్తరించాలని యోచిస్తోంది. డిజిటల్ చెల్లింపులకు సైబర్ ముప్పు వాటిల్లకుండా.. ఇప్పటికే టెక్నికల్ ఎక్స్ పర్ట్ లతో సంప్రదింపులు జరిపారు. అనంతరం డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను రాష్ట్రంలోని పలు ప్రధాన ఆలయాల్లో అమల్లోకి తెచ్చారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పునరుద్ధరణ తర్వాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఈ నేపథ్యంలో ఇక్కడ డిజిటల్ సేవలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. దర్శనం టికెట్లు, పూజలు, ప్రసాదాల కొనుగోళ్లకు యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసే అవకాశం కల్పిస్తున్నారు. భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కూడా టికెట్ల కొనుగోళ్లు, ఇతర సేవలకు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి, బాసర జ్ఞాన సరస్వతి ఆలయాల్లోనూ క్యూఆర్ కోడ్ తో డిజిటల్ పేమెంట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు.
కాగా, ప్రతి విభాగానికి, ప్రతి సేవకు సపరేట్ డిజిటల్ అకౌంట్లను కేటాయించడంతో ఏ సేవ ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో స్పష్టంగా తెలియనుంది. దీంతో నిధుల నిర్వహణలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుంది. లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు ఆడిటింగ్ ప్రక్రియ కూడా సులభతరం అవుతుందని దేవాదాయశాఖ భావిస్తోంది.
మేడారంలోనూ డిజిటల్ చెల్లింపులు..
త్వరలో రాష్ట్రంలో ములుగు జిల్లా మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర జరగనున్నది. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ జాతరలోనూ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు దేవాదాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. భక్తులు నగదు రహిత లావాదేవీల ద్వారా మరింత సౌకర్యవంతంగా మొక్కులు చెల్లించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది.