ఎక్సైజ్‌‌‌‌కు పాత పాలసీనే!

ఎక్సైజ్‌‌‌‌కు పాత పాలసీనే!

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:రాష్ట్రంలో ఎక్సైజ్‌‌‌‌ పాలసీ కోసం సర్కారు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతమున్న పాలసీనే కొనసాగించాలా? కొత్త పాలసీ తేవాలా? అనే విషయంపై సమాలోచనలు చేస్తోంది. రాష్ట్రంలో 2,216 మద్యం షాపులు ఉండగా.. 2017 అక్టోబర్‌‌‌‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన రెండేళ్ల లైసెన్సులు ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌ 31తో ముగియనున్నాయి. అక్టోబర్‌‌‌‌ 1 నుంచి అమలు చేయాల్సిన కొత్త విధానంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత పాలసీ బాగుందని, చిన్న మార్పులు మినహా పెద్దగా మార్చే ఉద్దేశం లేకపోవచ్చని చెబుతున్నారు.

లైసెన్స్‌‌‌‌ అప్లికేషన్‌‌‌‌ ఫీజు పెంచే యోచన

రాష్ట్రంలో ప్రస్తుతం 2,216 మద్యం దుకాణాల నుంచి రూ.1,360 కోట్ల లైసెన్సు రుసుము వసూలైంది. ఈసారి కొత్త షాపులు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేనట్లు తెలుస్తోంది. లైసెన్స్‌‌‌‌ అప్లికేషన్‌‌‌‌ ఫీజు మాత్రం కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత ఎక్సైజ్‌‌‌‌ సంవత్సరంలో నాన్‌‌‌‌ రిఫండబుల్‌‌‌‌ అప్లికేషన్‌‌‌‌ ఫీజును 50 వేల నుంచి లక్షకు పెంచారు. దీంతో అప్లికేషన్ల ద్వారానే రూ.411 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి అప్లికేషన్​ ఫీజు కొంత పెరిగే చాన్స్‌‌‌‌ ఉండటంతో ఆబ్కారీకి మరింత ఎక్కువ ఆదాయం సమకూరనుంది. ఈ ఏడాది ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దరఖాస్తులు స్వీకరించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

పర్మిట్‌‌‌‌ రూమ్‌‌‌‌ల తొలగింపు లేనట్టే?

ఎక్సైజ్‌‌‌‌ పాలసీలో భాగంగా పర్మిట్‌‌‌‌ రూమ్‌‌‌‌లను రద్దు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పర్మిట్‌‌‌‌ రూమ్‌‌‌‌లు రద్దు చేయాలని ప్రతిపక్షాలు కూడా డిమాండ్‌‌‌‌ చేస్తున్నాయి. భారీగా ఆదాయం కోల్పోయే అవకాశం ఉండటంతో దీనిని డీలర్లు వ్యతిరేకిస్తున్నారు. పర్మిట్‌‌‌‌ రూమ్‌‌‌‌ల్లో పలు కేటగిరీలున్నాయి. చిన్న పర్మిట్‌‌‌‌ రూమ్‌‌‌‌ అయితే 20 చదరపు మీటర్ల కంటే తక్కువగా ఉండాలి. పెద్దదైతే 100 చదరపు మీటర్లు దాటకూడదు. పర్మిట్‌‌‌‌ రూమ్‌‌‌‌ల్లో కుర్చీలు, టేబుళ్లు ఉండొద్దు. ఫుడ్‌‌‌‌ ఐటెమ్స్‌‌‌‌ సరఫరా చేయరాదు.
పర్మిట్‌‌‌‌ రూమ్‌‌‌‌లను ఎత్తేసే ప్రతిపాదన సర్కారు వద్ద లేదని సమాచారం.