సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ, పర్సెంటేజ్ షేరింగ్ విధానం అమలుపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ మంగళవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. నిర్మాతలు చదలవాడ శ్రీనివాస్, శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్‌తో పాటు పలువురు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘గత 20 ఏళ్లుగా ఎగ్జిబిటర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి గిట్టుబాటు లేక, ఆదరణ లేక పరిస్థితులు క్షీణించాయి. గత ఏడాదిగా పరిస్థితి మరింత దిగజారింది. ఎగ్జిబిటర్ బాగుంటేనే సినిమా పరిశ్రమ బాగుంటుంది. నిర్మాతగా వారికి నా సపోర్ట్ వంద శాతం ఉంటుంది’ అని అన్నారు.
శిరీష్ రెడ్డి మాట్లాడుతూ ‘మేము పర్సెంటేజ్ విధానం గురించి మాట్లాడుతున్నామంటే ఇది ఎగ్జిబిటర్ల బ్రతుకుపోరాటం. ఏ సినిమాను టార్గెట్ చేసి గానీ, ఏ నిర్మాతను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతో గానీ ఇది చేయడం లేదు. థియేటర్లను రక్షించండి. మిగిలిన రాష్ట్రాల్లో థియేటర్లకు పర్సంటేజీ విధానం అమలు చేసి ఇక్కడ మాత్రం ఎందుకు రెంటల్ పద్ధతిలో సినిమా రిలీజ్ చేస్తున్నారో ఒకసారి ప్రశ్నించుకోవాలి’ అని చెప్పారు. నిర్మాత సునీల్ నారంగ్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్ సహా తదితరులు పాల్గొన్నారు.
