
- అధికారిక ప్రకటన కోసం కేంద్ర హోంశాఖతో సంప్రదింపులు
- తక్షణ సాయం కింద ఒక్కో ఫ్యామిలీకి రూ.15 లక్షలు అందజేత
- ఆనవాళ్లు దొరికిన వెంటనే చెప్తామన్న అధికారులు
- ఇండ్లకు తిరిగి వెళ్లిపోవాలని బాధిత కుటుంబ సభ్యులకు సూచన
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ ప్రమాద ఘటనలో ఇంకా 8 మంది ఆచూకీ దొరకలేదు. పేలుడు సంభవించినప్పుడు వాళ్లంతా కాలి బూడిదై ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో ఇంకా రెస్క్యూ కొనసాగుతున్నది. 8 మందికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు కూడా దొరకడం లేదు. ఈ ప్రమాదంలో చనిపోయిన 44 మంది డెడ్‌బాడీలను అధికారులు వారి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. మొత్తం 52 మంది మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. బుధవారం నాటికి కూడా 8 మందికి సంబంధించిన చిన్న క్లూ కూడా దొరకలేదని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. బాధిత కుటుంబాలన్నీ తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని సూచించినట్లు చెప్పారు. 8 మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించేందుకు కేంద్ర హోంశాఖతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.
డీఎన్ఏ పరీక్షల కోసం 100 శాంపిళ్లు
8 మంది కార్మికుల కుటుంబీకులకు సంబంధించిన డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఒక్కో ఫ్యామిలీ నుంచి 2 సార్లు రక్త నమూనాలు సేకరించారు. పటాన్చెరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో కొన్ని డెడ్ బాడీలకు సంబంధించిన అవశేషాలు ఉండడంతో మరోసారి వాటితో డీఎన్ఏ పోల్చి చూడనున్నారు. కార్మికుల కుటుంబ సభ్యులంతా పాశమైలారం ఐలా ఆఫీస్ వద్ద పడిగాపులు కాస్తూ కూర్చున్నారు. బాధిత కుటుంబాలకు ఐలా భవన్లో వసతి, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. డెడ్‌బాడీల ఆనవాళ్లు దొరికే వరకు ఫ్యాక్టరీలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉంటాయని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఆనవాళ్లు దొరికిన వెంటనే డీఎన్ఏతో పోల్చి చూస్తామన్నారు. తక్షణ సహాయం కింద రూ.15 లక్షలు, దారి ఖర్చులకు రూ.10వేలు అందజేశామని తెలిపారు.
తక్షణ సాయం కింద బాధితులకు రూ.15 లక్షలు
ఆచూకీ లభించని 8 మంది కార్మికుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.15 లక్షల చొప్పున అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సమక్షంలో సిగాచి ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ అందజేసింది. రాహుల్ కుమార్ శర్మ (యూపీ), శివాజీ కుమార్ (బిహార్), జి.వెంకటేశ్ (ఏపీ), విజయ్ కుమార్ నిషద్ (యూపీ), అఖిలేశ్ కుమార్ నిషద్ (యూపీ), సూర్యనోల్లు జస్టిన్ (తెలంగాణ), ఎస్.రవి (తెలంగాణ), ఇర్ఫాన్ అన్సారి (జార్ఖండ్)గా గుర్తించారు. వీళ్ల ఆధారాలు దొరికితే సమాచారం ఇస్తామని కుటుంబ సభ్యులకు అధికారులు హామీ ఇచ్చారు.