సర్కారు వద్దన్న పంటలే  ఎక్కువేసిన్రు

సర్కారు వద్దన్న పంటలే  ఎక్కువేసిన్రు
  • వ్యవసాయ శాఖ ప్లాన్‌‌‌‌ను పక్కన పెట్టిన రైతులు
  • సర్కారు చెప్పిన పత్తి, కంది కంటే.. వద్దని చెప్పిన వరి, సోయా, మక్కలే సాగు
  • మూడు రెట్లు ఎక్కువగా మక్కలు, సోయా
  • వ్యవసాయ శాఖ టార్గెట్‌‌‌‌ను చాలా పంటలు రీచ్‌‌‌‌ కాలే

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గత ఏడాది సర్కారు చెప్పినట్లు పంటలేసి నష్టపోయిన రైతులు.. ఈసారి తమకు అనుకూలమైన పంటలే వేశారు. వానాకాలం సీజన్ పంట సాగుపై వ్యవసాయ శాఖ ప్రణాళికను పక్కన పెట్టేశారు. పత్తి, కంది ఎక్కువగా సాగు చేయాలని.. వరి, సోయా, మక్కలు వేయొద్దని ప్రభుత్వం చెప్పింది. కానీ వేయొద్దన్న పంటలే వేశారు. పంట ప్లాన్‌‌‌‌లో  భాగంగా ఇప్పటి వరకు 20 శాతం పంటలు తక్కువే సాగు చేశారు. నిరుడు వానాకాలం సాగు 1.35 కోట్ల ఎకరాలు కాగా, ఈ సారి 1.11 కోట్ల ఎకరాల్లో మాత్రమే సాగైనట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి.
మక్కలు కొనడం బంజేసినా..
రాష్ట్రంలో ధాన్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతోందని, దిగుబడికి తగిన మార్కెట్‌‌‌‌ ఉండటం లేదని, వరి ఎక్కువగా సాగు చేయొద్దని రైతులకు సర్కారు సూచించింది. ఈ యేడు వరి 41.85 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని టార్గెట్‌‌‌‌ పెట్టింది. ఇప్పటిదాకా రైతులు 39.4 లక్షల ఎకరాల్లో (94 శాతం) సాగు చేశారు. వరి నాట్లు ఇంకా పడుతున్నాయి. దీంతో మొత్తంగా 45 లక్షల నుంచి 50 లక్షల ఎకరాల దాకా సాగు జరిగే అవకాశం ఉంది. విత్తనాల కొరత ఉండటంతో సోయా పెద్దగా వేయవద్దని ప్రభుత్వం చెప్పింది. సోయాను 1.33 లక్షల ఎకరాలకే పరమితం చేయాలని పంట ప్లాన్‌‌‌‌లో సూచించింది. కానీ రైతులు 3.48 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. మక్కలు వేయొద్దని సర్కారుచాన్నాళ్ల నుంచి చెబుతోంది. గత యాసంగి నుంచి కొనడమే బంద్‌‌‌‌ చేసింది. వానాకాలంలో 2.27 లక్షల ఎకరాలే వేయాలని సూచించింది. కానీ రైతులు ఏకంగా 6.04 లక్షల ఎకరాల్లో మక్కలు సాగు చేశారు.
పత్తి, కంది.. టార్గెట్‌‌‌‌కు ఎంతో దూరం..
కేంద్రం కొనుగోలు చేసే పత్తి, కందులను ఎక్కువగా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. గతేడాది 60.53 లక్షల ఎకరాల్లో సాగైన పత్తిని.. ఈసారి 70 లక్షల ఎకరాల్లో వేయాలని వ్యవసాయ శాఖ పేర్కొంది. కానీ గతేడాది కంటే పది లక్షల ఎకరాల సాగు తగ్గింది. ఇప్పటిదాకా 50.24 లక్షల ఎకరాల్లోనే పత్తి వేశారు. కందులు 20 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని టార్గెట్‌‌‌‌ పెట్టగా.. 8.89 లక్షల ఎకరాల్లో మాత్రమే రైతులు సాగు చేశారు. అంటే పంట ప్లాన్‌‌‌‌లో 44.45 శాతం తగ్గింది. వ్యవసాయశాఖ ప్లాన్‌‌‌‌లో చాలా పంటలు టార్గెట్‌‌‌‌ రీచ్‌‌‌‌ కాలేదు. సజ్జ, వేరుశనగ, ఆముదం, కంది, పంటలు కనీసం 50 శాతం కూడా లక్ష్యాన్ని చేరుకోలేదు. వేరుశనగ టార్గెట్ 3.9 లక్షల ఎకరాలు కాగా.. 1.55 లక్షల ఎకరాలే సాగైంది.