రైతులను తీవ్రంగా దెబ్బతీసిన మిచౌంగ్ తుఫాన్.. వేలాది ఎకరాల్లో పంట నష్టం

రైతులను తీవ్రంగా దెబ్బతీసిన మిచౌంగ్ తుఫాన్.. వేలాది ఎకరాల్లో పంట నష్టం

మిచౌంగ్ తుఫాన్ రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. చేతికొచ్చిన పంట నీళ్లపాలవ్వడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఎడతెరిపిలేని వానలకు వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. చాలా ప్రాంతాల్లో పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వేల ఎకరాల్లో వరి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట.. రైతు కళ్ల ముందే వర్షార్పణం కావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు.. గాలి వాన బీభత్సం సృష్టించడంతో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో వరిపంట పూర్తిగా తడిసిపోయింది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన.. పంట రైతుల కళ్ల ముందే కొట్టుకుపోతుంటే.. రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

మరోవైపు ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలోని ఐదు మండలాలలో రెండు రోజుల నుంచి వర్షం పడుతుంది. సత్తుపల్లి మండలంలో 158.2, వేంసురు మండలం లో 155.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. భారీ వర్షాలకు బెతుపల్లి పెద్ద చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం అయింది. 16 ఆడుగులు గాను.. ప్రస్తుత నీటి మట్టం 18.02 ఆడుగులుగా ఉంది. లంకాసాగర్ ప్రాజెక్ట్ కు వరదనీరు పోటెత్తుతోంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు మిర్చి, మొక్కజొన్న పంటలు కల్లాలలోనే తడిసిపోతున్నాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

పంటలకు ఓ వైపు బొబ్బ, ముడుత తెగుళ్లతో పంట తీవ్ర నష్టం జరిగి.. కొంత నష్షపోతే.. మరోవైపు వర్షం తీవ్ర దుఖాన్ని మిగిల్చిందని వాపోతున్నారు రైతులు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.