
- తెలంగాణ రైతు సంఘం ఆరోపణలు
- సమస్య పరిష్కరించకపోతే ఆందోళనలు చేస్తామని వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని తెలంగాణ రైతు సంఘం ఆరోపించింది. కేటాయించిన యూరియా కోటాను సకాలంలో సరఫరా చేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు, ప్రధాన కార్యదర్శి టి.సాగర్ హెచ్చరించారు. ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచాల్సి ఉన్నప్పటికీ, అనేక జిల్లాల్లో సహకార సంఘాలు, డీలర్ షాపుల వద్ద రైతులు గంటల తరబడి బారులు తీరుతున్నారని సంఘం నేతలు వాపోయారు. యూరియా సరఫరాలో జాప్యం వల్ల పంటల దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రెచ్చిపోతున్న డీలర్లు
ఎరువుల కొరతను అదునుగా చూసుకుని కొందరు డీలర్లు 45 కిలోల యూరియా బస్తా ధర రూ.242 కాగా, అదనపు డబ్బులు వసూలు చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని తెలంగాణ రైతు సంఘం ఆరోపించారు. కృత్రిమ కొరత సృష్టించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.యూరియా వాడకాన్ని తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, 2025---–26 బడ్జెట్‌లో ఎరువులపై రాయితీని తగ్గించిందని విమర్శించారు. నానో యూరియా, నానో డీఏపీ ఎరువులను ఇఫ్కో సంస్థ ద్వారా తయారు చేసి, వీటి ఉపయోగాలను క్షేత్రస్థాయిలో ప్రదర్శించకుండానే రైతులపై బలవంతంగా రుద్దుతున్నారని మండిపడింది.
2025 ఏప్రిల్–ఆగస్టు నెలల కాలానికి కేంద్రం 8.30 లక్షల టన్నుల యూరియా కేటాయించగా, కేవలం 5.32 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసిందని, దీంతో 2.98 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఏర్పడిందని వెల్లడించారు. రాష్ట్రానికి కేటాయించిన యూరియా కోటాను సకాలంలో సరఫరా చేయాలని, బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా వ్యవసాయ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని రైతులు హెచ్చరించారు.