ఈటల నా భుజాల మీద తుపాకి పెట్టాలనుకుంటున్నారు

ఈటల నా భుజాల మీద తుపాకి పెట్టాలనుకుంటున్నారు

హైదరాబాద్: రాష్ట్ర మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఈటల తన భుజాల మీద తుపాకీ పెట్టాలనుకోవడం విఫలయత్నమని హరీశ్ అన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ మార్గదర్శకత్వంలోనే నడుచుకుంటానని స్పష్టం చేశారు. ఈటల టీఆర్ఎస్‌ను వీడినా పార్టీకి వీసమెత్తు నష్టం కూడా వాటిల్లదన్నారు. 

కేసీఆర్ మాట జవదాటను 
‘టీఆర్ఎస్‌ పార్టీలో నేను నిబ‌ద్ధత, విధేయ‌త‌, క్ర‌మ‌శిక్ష‌ణ ఉన్న‌ కార్య‌క‌ర్త‌ను.  పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వ‌ర‌కు పార్టీ ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధిగా పని చేస్తున్నా. టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌గా ఉన్న నాకు పార్టీ నాయ‌క‌త్వం ఏ ప‌ని అప్ప‌గించినా దాన్ని పూర్తిచేయ‌డమే నా విధి, బాధ్య‌త‌. పార్టీ అధినేతగా కేసీఆర్ ఏ ఆదేశం ఇచ్చినా శిర‌సావ‌హించ‌డం నా కర్త‌వ్యంగా భావిస్తా.  కేసీఆర్ పార్టీ అధ్య‌క్షులే కాదు.. నాకు గురువు, మార్గ‌ద‌ర్శి కూడా. ఆయన నాకు తండ్రితో స‌మానం. కేసీఆర్ మాట జ‌వ‌దాట‌కుండా న‌డుచుకుంటున్నా. గ‌తంలో అనేక‌సార్లు పలు వేదిక‌ల‌పై ఇదే విష‌యాన్ని సుస్పష్టంగా చెప్పా. ఇప్పుడు మ‌రోసారి చెప్తున్న‌ా.. కంఠంలో ఊపిరిఉన్నంత వ‌ర‌కు ఇలాగే న‌డుచుకుంటా’ అని హరీశ్ రావు పేర్కొన్నారు. 

ఈటలకు విజ్ఞత లేదు
‘తాచెడ్డ కోతి వ‌న‌మెల్ల చెరిచింద‌న్న‌ట్టుగా ఈట‌ల రాజేంద‌ర్ వైఖ‌రి ఉంది. పార్టీని వీడ‌టానికి ఆయ‌న‌కు అనేక కార‌ణాలుండొచ్చు. పార్టీలో ఉండాలా.. వెళ్లిపోవాలా అన్న‌ది ఆయ‌న ఇష్టం. ఈటల పార్టీని వీడినంత మాత్రాన టీఆర్ఎస్‌‌కు వీస‌మెత్తు న‌ష్టం లేదు. ఆయ‌న పార్టీకి చేసిన సేవ‌క‌న్నా.. పార్టీ ఆయ‌న‌కు ఇచ్చిన అవ‌కాశాలే ఎక్కువ‌. త‌న స‌మ‌స్య‌ల‌కు, గొడ‌వ‌కు నైతిక బ‌లం కోసం ప‌దేప‌దే నా పేరును ప్ర‌స్తావించ‌డం ఈట‌ల రాజేంద‌ర్ భావ‌దారిద్ర్యానికి, విజ్ఞత‌, విచ‌క్ష‌ణ‌లేమికి నిద‌ర్శ‌నం. నా భుజాల మీద తుపాకి పెట్టాల‌నుకోవ‌డం విఫ‌లయ‌త్నం మాత్ర‌మే కాదు.. వికార‌మైన ప్ర‌య‌త్నం కూడా. ఆయ‌న మాట‌ల్లో మ‌నో వికార‌మే త‌ప్ప స‌త్యం ఎంత మాత్రం లేదు. నా గురించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్న‌ా’ అని హరీశ్ రావు చెప్పారు.