ఖమ్మం టౌన్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లకు పరిమితమైన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు.
రాష్ట్ర ఆవతరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం ప్రధాన లక్ష్యాలుగా దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
రాష్ట్రంలోని పేద కుటుంబాల కోసం ఇందిరమ్మ కుటుంబ బీమా స్కీమ్‌ను అమలు చేస్తున్నామని, దీంతో 1.15 కోట్ల ఫ్యామిలీలకు లబ్ది కలుగుతుందన్నారు. ఈ అకడమిక్ ఇయర్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ అమలు చేస్తామని చెప్పారు.
జూనియర్ కాలేజీ స్టూడెంట్లకు కూడా మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందిస్తామని తెలిపారు. అభయహస్తం కింద కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని, పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను, అమరవీరుల కుటుంబ సభ్యులను భట్టి సన్మానించారు. ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్ దత్ పాల్గొన్నారు.
