- మీ ఇష్టం వచ్చినట్టు నీళ్లు తోడేస్తామంటే కుదరదు
- ఏపీకి తేల్చి చెప్పిన తెలంగాణ
- పోతిరెడ్డిపాడు నుంచి అడ్డగోలుగా వాడేస్తున్నారని త్రీ మెంబర్ కమిటీ మీటింగ్‌లో ఫిర్యాదు
- తమకు 47 టీఎంసీలు తాగునీరు ఇవ్వాలని డిమాండ్
- 66:34 ప్రకారమే పంచాలంటూ ఏపీ పట్టు
- శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చెయ్యొద్దంటూ వాదన
- ఏమీ తేలకుండానే ముగిసిన కృష్ణా బోర్డు సమావేశం
- వచ్చే నెల 4న మళ్లీ సమావేశం కావాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: కృష్ణా బోర్డు త్రీ మెంబర్ కమిటీ మీటింగ్ ఏం తేల్చకుండానే ముగిసింది. నీటి వాటాల పంపకంపై రెండు రాష్ట్రాలు పోటాపోటీగా వాదనలు వినిపించడంతో ఏ ఫలితమూ తేలలేదు. సోమవారం జలసౌధలో బోర్డు మెంబర్ సెక్రటరీ నేతృత్వంలో త్రీ మెంబర్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, అధికారులు పాల్గొన్నారు. ఏపీకి నీళ్లేమీ లేవని తెలంగాణ ఈఎన్సీ రమేశ్ బాబు తేల్చి చెప్పారు. పోతిరెడ్డిపాడుపై కంట్రోల్ పెట్టాల్సిందేనని అన్నారు.
ఏపీ ఇష్టం వచ్చినట్టు నీటిని తోడుకుపోవడానికి లేదని, అలా చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా అక్కడి నుంచి 8 వేల క్యూసెక్కులు తోడేస్తున్నారంటూ అభ్యంతరం తెలిపారు. ఎస్ఆర్బీసీకి కేవలం 19 టీఎంసీలే ఉంటాయని, చెన్నై డ్రింకింగ్ వాటర్‌కు మరో 15 టీఎంసీలే ఉన్నాయని స్పష్టం చేశారు. మొత్తంగా 34 టీఎంసీలకు మించి ఇవ్వడానికి లేదని తేల్చిచెప్పారు. అది కూడా జులై నుంచి అక్టోబర్ మధ్యలోనే తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఎస్ఆర్బీసీ నుంచి సాగు అవసరాలకు నీళ్లిచ్చేది లేదన్నారు. అయితే ఏపీ కలగజేసుకుని తమకున్న ఎన్ బ్లాక్ కేటాయింపుల్లో ఎక్కడి నుంచైనా నీళ్లను తీసుకుపోతామని, ఎలా అడ్డు చెప్తారని వాదించింది. దీనికి తెలంగాణ ఈఎన్సీ గట్టిగానే జవాబిచ్చారు. మిగతా టైంలో ఇక్కడి నుంచి తీసుకుపోయినా ఓకేగానీ.. ఇది ఎల్ నినో కాలమని, అలాంటప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటామంటే కుదరదని తేల్చి చెప్పారు. ఏపీకి ఎక్కువ నీళ్లు ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా అన్నే నీళ్లు తమకూ ఇవ్వాలని బోర్డును డిమాండ్ చేశారు. మీటింగ్ ఎటూ తేలకపోవడంతో మళ్లీ సెప్టెంబర్ 4న నిర్వహించాలని నిర్ణయించారు.
ప్రకారం పంచాలి: ఏపీ
నీటి పంపకాలు చేయాల్సి వస్తే ఇంతకు ముందున్న 66:34 నిష్పత్తిలోనే పంచాలని మీటింగ్‌లో ఏపీ పట్టుబట్టింది. దీనికీ తెలంగాణ ఈఎన్సీ గట్టిగానే బదులిచ్చారు. అసలు ఏపీకే నీళ్లు లేవన్నారు. నీటి వాటాలు సగం సగం పంచాల్సిందేనని వాదించారు. ఈ సమయంలోనే ఏపీ 47 టీఎంసీల నీళ్లు కావాలని అడగ్గా.. తమకూ అంతే ఇవ్వాలని తేల్చి చెప్పారు. శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తికి తెలంగాణ నీళ్లను వాడేస్తున్నదని, 840 అడుగులకు తగ్గితే తాము నీటిని తీసుకుపోలేమని ఏపీ వాదించింది.
అయితే, పోతిరెడ్డిపాడు నుంచి ఇప్పటికే ఎక్కువ తీసుకుపోతున్నారని మన ఈఎన్సీ అభ్యంతరం చెప్పారు. సాగర్ డెడ్ స్టోరేజ్‌కు వెళ్తే తమకు వాడుకునేందుకు అవకాశం ఉండదని, శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తితోనే సాగర్‌కు నీటిని తీసుకొచ్చేందుకు వీలవుతుందని స్పష్టం చేశారు. ఎల్ నినో నేపథ్యంలో ఏం చేసినా తాగు నీటి అవసరాలాకే వాడుకోవాలని రెండు రాష్ట్రాలు స్పష్టం చేశాయి.
