అక్రమ దత్తత నుంచి కాపాడిన చిన్నారుల వివరాలివ్వండి

అక్రమ దత్తత నుంచి కాపాడిన చిన్నారుల వివరాలివ్వండి
  • శిశువుల అక్రమ రవాణాపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అక్రమంగా దత్తతల నుంచి కాపాడి బాలల రక్షణ గృహాల్లో ఉంచిన చిన్నారుల పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సూర్యాపేటలో అక్రమంగా దత్తతకు తీసుకున్న 9 మంది చిన్నారులను అధికారులు గుర్తించినా వారి తల్లిదండ్రుల ఆచూకీని తెలుసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 2023లో దత్తత తీసుకున్న చిన్నారిని పోలీసులు స్వాధీనం చేసుకుని స్త్రీశిశు సంక్షేమశాఖకు అప్పగించడాన్ని సమర్థిస్తూ సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నల్గొండ జిల్లా సూరారం మండలానికి చెందిన ఎం.వెంకన్న దంపతులు హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు.

దీనిపై హైకోర్టు సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. సూర్యాపేటలో 9 మంది చిన్నారులతోపాటు దత్తతకు అందుబాటులో ఉన్న చిన్నారుల వివరాలను వెల్లడించడంలో పిల్లల సంక్షేమ కమిటీ అనుసరించిన విధానాన్ని ప్రశ్నించింది. సీఎఆర్‌‌‌‌‌‌‌‌ఏ పోర్టల్‌‌‌‌‌‌‌‌ నిర్వాహణపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో శిశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి, అదృశ్యమైన చిన్నారులను గుర్తించడానికి అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ, పాఠశాల సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారని, ఇలాంటి విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేసే అంశాన్ని పరిశీలించవచ్చంది.