విద్యుత్రంగ చరిత్రపై మ్యూజియం పెట్టాలి : జస్టిస్ దేవరాజు నాగార్జున

విద్యుత్రంగ చరిత్రపై మ్యూజియం పెట్టాలి : జస్టిస్ దేవరాజు నాగార్జున
  •     రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్ర, సాంకేతిక పరిణామాలను ప్రతిబింబించేలా హైదరాబాద్​లో మ్యూజియం లేదా శాశ్వత ప్రదర్శన కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున సూచించారు. విద్యుత్ రంగంపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించేందుకు, సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న యువతకు ప్రత్యక్ష అనుభవాన్ని అందించేందుకు పవర్​ ఎగ్జిబిషన్​ వంటి ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. 

సదరన్​ డిస్కమ్​ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహిస్తున్న పవర్ ఎగ్జిబిషన్–2026ను సోమవారం ఆయనతో పాటు ఈఆర్​సీ సభ్యులు కంచర్ల రఘు, చెరుకూరి శ్రీనివాసరావు సందర్శించారు. విద్యుత్ రంగ చరిత్ర, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా అంశాలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థపై విద్యార్థులు, యువత, సాధారణ ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించే విధంగా ఈ ప్రదర్శనను రూపొందించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర రాజధానికే పరిమితం కాకుండా జిల్లా కేంద్రాల్లో కూడా ఇలాంటి పవర్ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తే మరింత మంది ప్రయోజనం పొందగలరని అభిప్రాయపడ్డారు. ఆయన వెంట జితేశ్ పాటిల్, శివాజీ, కృష్ణారెడ్డి, నరసింహులు ఉన్నారు. 

పవర్​ ఎగ్జిబిషన్​ను సందర్శించిన కవిత

సదరన్​ డిస్కమ్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పవర్ ఎగ్జిబిషన్–2026ను టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, హైదరాబాద్​ మాజీ పోలీస్​ కమిషనర్​ కొత్తకోట శ్రీనివాస్​ రెడ్డి వేర్వేరుగా సందర్శించారు.