- థర్డ్‌పార్టీ ఏజెన్సీతో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ కాల్‌సెంటర్
- త్వరలోనే సరికొత్త వ్యవస్థ అందుబాటులోకి
హైదరాబాద్, వెలుగు: ఆపదలో ఉన్న బాధితుల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన, విధి నిర్వహణలోని అవినీతి సహా పోలీసుల పనితీరుపై డీజీపీ కార్యాలయం క్షేత్రస్థాయిలో నిఘా పెంచనుంది. ఇప్పటికే అమలులో ఉన్న క్యూఆర్ కోడ్ ఫీడ్‌బ్యాక్ స్కానర్ విధానాన్ని స్థానిక పోలీసులు దుర్వినియోగం చేయడంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్‌ను ప్రారంభించనుంది. దీంతో పోలీసుల ప్రమేయం లేకుండా సమూల మార్పులు చేసేందుకు డీజీపీ సీవీ ఆనంద్ ప్రణాళికలు రూపొందించారు.
స్టేషన్‌లో పోలీసులు ఎలా స్పందించారు..?
పీఎస్‌కు వచ్చే బాధితులతో స్థానిక పోలీసులు మర్యాదగా, బాధ్యతగా వ్యవహరించే విధంగా ఫీడ్‌బ్యాక్ సెంటర్ ద్వారా సమాచారం సేకరించనున్నారు. స్టేషన్‌లో బాధితులకు ఎదురైన అనుభవం, సిబ్బంది పనితీరు, ఫిర్యాదు స్వీకరించే సమయంలో డబ్బులు అడిగారా అనే వివరాలతో పాటు కేసు దర్యాప్తు పురోగతికి సంబంధించిన సమాచారం అందిస్తున్నారా లేదా అనే అంశాలతో కూడిన ప్రశ్నలతో కాల్‌సెంటర్ పనిచేయనుంది. ఇందుకోసం పోలీసుల ప్రమేయం లేకుండా థర్డ్‌పార్టీ ఏజెన్సీతో ఏఐ ఆధారిత సిటిజన్ ఫీడ్‌బ్యాక్ కాల్‌సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి డీజీపీ చర్యలు చేపట్టారు.
ర్యాండమ్‌గా ఫోన్లు.. ఏఐ విశ్లేషణ
పీఎస్‌లో ఫిర్యాదుల ఆధారంగా కొందరికి ర్యాండమ్‌గా కాల్ చేయనున్నారు. రిసెప్షన్ దగ్గర్నుంచి పోలీసుల పనితీరు, కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించనున్నారు. బాధితుల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్‌ను ఏఐ ఆధారిత వ్యవస్థ ద్వారా విశ్లేషించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ పీఎస్‌పై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి, బాధితుల అసంతృప్తి, అధికారి లేదా సిబ్బంది పనితీరుపై వచ్చే ఎక్కువ ఫిర్యాదులను గుర్తిస్తారు.
ఉత్తమ అధికారిగా ఫీడ్‌బ్యాక్ వస్తున్న సిబ్బందిని ప్రోత్సహించడంతోపాటు బాధితుల పట్ల దురుసు ప్రవర్తన, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకునే విధంగా కాల్‌సెంటర్ ఫీడ్‌బ్యాక్‌ను వినియోగించనున్నారు.
