నీటి లభ్యత లేని రాష్ట్రాలకు నీళ్లివ్వాలె

నీటి లభ్యత లేని రాష్ట్రాలకు నీళ్లివ్వాలె
  • ఎన్‌‌డబ్ల్యూడీఏలో తెలంగాణ డిమాండ్

హైదరాబాద్‌‌, వెలుగు: గోదావరిలో లభ్యమయ్యే నీళ్ల లెక్క తేల్చాలని తెలంగాణ డిమాండ్‌‌ చేసింది. శుక్రవారం ఢిల్లీ విజ్ఞాన్‌‌ భవన్‌‌లో ఎన్‌‌డబ్ల్యూడీఏ 35వ యాన్యువల్‌‌ మీటింగ్‌‌ జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌‌ షెకావత్‌‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో తెలంగాణ తరపున గజ్వేల్‌‌ ఈఎన్సీ హరిరాం, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌‌ దేశ్‌‌పాండే పాల్గొన్నారు. గోదావరి, కావేరి అనుసంధానానికి ముందు గోదావరిలో నీటి లెక్క తేల్చాలని ఈ సందర్భంగా హరిరాం అన్నారు. ‘‘ఉమ్మడి ఏపీకి కేటాయించిన నికర జలాల్లో తెలంగాణ వాటా 967 టీఎంసీలు. వీటిలో 758 టీఎంసీలు వాడుకునేలా ప్రాజెక్టులు నిర్మించాం. మిగతా నీటి వినియోగానికి ఆరు ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. వాటి డీపీఆర్‌‌లు సీడబ్ల్యూసీకి పంపాం. కేంద్ర జలశక్తి శాఖ తమ ప్రాజెక్టులకు అనుమతిచ్చాకే మిగులు జలాలు లెక్కించాలి. గోదావరిలో మిగులు జలాలపై ఎన్‌‌డబ్ల్యూడీఏ స్టడీ సహేతుకంగా లేదు. ఛత్తీస్‌‌గఢ్‌‌, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు దీనిపై అనేక అభ్యంతరాలు లేవనెత్తాయి. గోదావరిలో మిగులు జలాల లెక్క తేల్చేముందు మూడు రాష్ట్రాల వాదన పరిగణనలోకి తీసుకోవాలి. 75 శాతం డిపెండబిలిటీ వద్ద గోదావరిలో మిగులు జలాలే లేవని ఏపీ ప్రభుత్వం వాదించింది. ఎగువ రాష్ట్రాలు వినియోగించుకోని వరద జలాలతో మా రాష్ట్రంలో ముంపు పెరగడం వంటి సమస్యలెన్నో వస్తున్నాయి. మిగులు జలాలు వాడుకునేందుకు మాకు అవకాశమివ్వాలి” అని విజ్ఞప్తి చేశారు.

నీటి లభ్యత లేని రాష్ట్రాలకు నీళ్లివ్వాలె: షెకావత్‌‌

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నీటి లభ్యత ఎక్కువుండగా, మరికొన్నింట్లో తాగునీటికి కూడా ఇబ్బందులున్నాయని షెకావత్‌‌ అన్నారు. నీళ్లు ఎక్కువున్న రాష్ట్రాలు తక్కువున్న రాష్ట్రాలకు ఇచ్చేందుకు జాతీయవాద స్ఫూర్తితో ముందుకు రావాలన్నారు. ఎన్‌‌డబ్ల్యూడీఏ ప్రయత్నాలు ఫలించి కెన్‌‌ -బెట్వా రివర్‌‌ లింకింగ్‌‌ ప్రాజెక్టు పట్టలెక్కింది. మిగతా ప్రాజెక్టులనూ చేపట్టేందుకు రాష్ట్రాలు ముందుకు రావాలి. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నీటి కొరతే అతి పెద్దది” అన్నారు.

17న గోదావరి బోర్డు సబ్‌‌ కమిటీ మీటింగ్‌‌

గోదావరి రివర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బోర్డు సబ్‌‌ కమిటీ మీటింగ్‌‌ ఈ నెల 17న జలసౌధలో నిర్వహిస్తున్నామని మెంబర్‌‌ సెక్రటరీ బీపీ పాండే శుక్రవారం సభ్యులకు లెటర్​ రాశారు. ఈ సమావేశంలో దేవాదుల లిఫ్ట్‌‌ స్కీంలోని గంగారం పంపహౌస్‌‌, కాకతీయ కెనాల్‌‌పై గల గీసుగొండ క్రాస్‌‌ రెగ్యులేటర్‌‌, ఏపీలోని తొర్రిగడ్డ లిఫ్ట్‌‌ స్కీం, చెంగల్నాడు లిఫ్ట్‌‌ స్కీంలపై చర్చించనున్నట్టు తెలిపారు. సబ్‌‌ కమిటీ సభ్యులు సమావేశానికి సంబంధిత సమాచారంతో హాజరుకావాలన్నారు.

ప్రాజెక్టుల డేటా ఇవ్వాలని ఏపీ, తెలంగాణలకు కృష్ణా బోర్డు లేఖ

కేఆర్‌‌ఎంబీ గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌ అమలు కోసం ప్రాజెక్టుల డేటా పంపాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను కృష్ణా బోర్డు కోరింది. ఈ మేరకు బోర్డు మెంబర్‌‌ సెక్రటరీ డీఎం రాయ్‌‌పురే రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు శుక్రవారం లెటర్​రాశారు. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌, పులిచింతల ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాలని కోరారు. ఆయా ప్రాజెక్టుల స్పిల్‌‌ వే, పెన్‌‌స్టాక్‌‌, కెనాల్‌‌ హెడ్‌‌ రెగ్యులేటర్లు, ఇతర ఔట్‌‌లెట్ల వివరాలు, ప్రాజెక్టులకు గేట్లు, వాటి ఆపరేషన్‌‌ వివరాలు ఇవ్వాలని సూచించారు. వందేండ్లలో ఒకసారి, 50 ఏండ్లలో ఒకసారి, 25 ఏండ్లలో ఒకసారి ప్రాజెక్టుల మానిటరింగ్‌‌ ఫ్లడ్‌‌ హైడ్రోగ్రాఫ్స్‌‌ ఇవ్వాలని కోరారు. ఆయా ప్రాజెక్టుల్లోకి చేరే వరదను ఎప్పుడెప్పుడు ఎలా వినియోగించుకుంటారు, ఏ ఔట్‌‌లెట్ల ద్వారా మళ్లిస్తారో సమాచారం ఇవ్వాలన్నారు. గత 30 ఏళ్లకు సంబంధించి ఒక్కో ఏడాది 10 రోజుల డైలీ వాటర్‌‌ డిమాండ్‌‌, వివిధ ఔట్‌‌లెట్ల ద్వారా నీటి మళ్లింపు, ఇతర సమాచారం ఇవ్వాలని కోరారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌ ప్రాజెక్టుల డేటాను వీలైనంత త్వరగా ఇవ్వాలన్నారు.