- థర్మల్ డ్రోన్లతో 24 గంటల నిఘా
- ట్రాప్ కెమెరాలో పులి కదలికల రికార్డు
సిద్దిపేట, వెలుగు: కోహెడ మండలం ఆరేపల్లి గ్రామ పరిసరాల్లో పులి కదలికలను తెలంగాణ అటవీ శాఖ పర్యవేక్షిస్తోంది. మూడు రోజులుగా పరిసర ప్రాంతాల్లోనే పులి ఉంటున్నట్టు ప్రత్యేక ట్రాప్ కెమెరాలతో అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి కదలికలను గమనించేందుకు థర్మల్ ఇమేజింగ్ డ్రోన్లను వినియోగంలోకి తీసుకరావడంతో పాటు 24 గంటల పాటు నిఘా ఏర్పాటు చేశారు.
డ్రోన్ల ద్వారా రియల్ టైమ్లో సమాచారం అందుకుంటూ అవసరమైన చోట చర్యలు తీసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా, పులికి హాని జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకూడదని, పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
పరిస్థితిని సమర్థంగా నిర్వహించేందుకు పెట్రోలింగ్ బృందాలను రంగంలోకి దించారు. పుణే నుంచి వచ్చిన నిపుణుల రెస్క్యూ బృందం అప్రమత్తంగా ఉన్నారు. పులి సహజంగా అటవీ ప్రాంతం వైపు వెళ్లేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించగా మంగళ వారం తెల్లవారుజామున ట్రాప్ కెమెరాలో పులి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి.
అల్లాదుర్గం మండలంలో చిరుత సంచారం
అల్లాదుర్గం: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. మండలంలోని ఐబీ చౌరస్తా వద్ద 161 జాతీయ రహదారి రోడ్డు పక్కన సోమవారం రాత్రి స్థానికులకు చిరుత పులి కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. మంగళవారం అటవీ అధికారులు చిరుత సంచరిస్తున్న ప్రదేశాలను పరిశీలించి, ఆనవాళ్లను గుర్తించారు. గొల్ల కుంట తండా సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి చిరుత వెళ్లినట్లు భావించారు.
పులి సంచరిస్తున్న విషయం వాస్తవమేనని పెద్దశంకరంపేట్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి రమేశ్ కుమార్ చెప్పారు. గొర్ల కాపరులు, వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే రైతులు, గ్రామస్తులు అటువైపు వెళ్లకూడదని బీట్ ఆఫీసర్ మనస్విని, సర్పంచ్ మాన్యా నాయక్ సూచించారు.
