
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు : తెలంగాణ అవతరణ వేడుకలు ఉమ్మడి మెదక్ జిల్లాలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన సలహాదారు కె.కేశవరావు పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. సంగారెడ్డిలో జరిగిన ప్రోగ్రాంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగరేశారు. అమరవీరుల కుటుంబాలను సన్మానించారు.
సిద్ధిపేట కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారులో చేపట్టిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు పథకం (మహాలక్ష్మీ)తో పాటు పలు అంశాల గురించి వివరించారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా..
సంగారెడ్డి, వెలుగు: అమరవీరుల త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్నామన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంత్రి దామోదర రాజనర్సింహ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి మంత్రి తన ప్రసంగంలో వివరించారు. ఈ వేడుకల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ పరితోష్ పంకజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, అదనపు కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్ , వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ అమరవీరుల కుటుంబాలను మంత్రి దామోదర రాజనర్సింహ, కలెక్టర్ ఘనంగా సన్మానించారు. అనంతరం స్టూడెంట్స్ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వారు తిలకించారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాల ప్రదర్శన కొనసాగింది. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, అటవీ, పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమం, నీటి పారుదల, ఫిషరీస్ తదితర శాఖల స్టాల్స్ ను మంత్రి తిలకించారు.