తెలంగాణ ఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌కు అరుదైన గుర్తింపు

తెలంగాణ ఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌కు అరుదైన గుర్తింపు
  • ‘గవర్నమెంట్‌‌ ఎగ్జామినర్‌‌ ఆఫ్‌‌ ఎలక్ట్రానిక్‌‌ ఎవిడెన్స్‌‌’గా కేంద్రం రికగ్నైజేషన్

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ ఫోరెన్సిక్‌‌ సైన్స్‌‌ లేబరేటరీ(టీజీఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌)కి అరుదైన గుర్తింపు లభించింది. ఎలక్ట్రానిక్‌‌ ఆధారాల పరిశీలనలో 
‘గవర్నమెంట్‌‌ ఎగ్జామినర్‌‌ ఆఫ్‌‌ ఎలక్ట్రానిక్‌‌ ఎవిడెన్స్‌‌’గా కేంద్ర ఎలక్ట్రానిక్స్‌‌ అండ్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఐటీయాక్ట్‌‌ 2000 సెక్షన్‌‌ 79ఏ సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో ఎలక్ట్రానిక్‌‌ ఆధారాల పరిశీలన, పరిశోధన, ధ్రువీకరణకు సంబంధించిన రిపోర్టులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. 

టీజీ ఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌ ఇచ్చే ఆధారాలు దేశంలోని అన్ని కోర్టులు విశ్వసనీయంగా పరిగణనలోకి తీసుకోవడంతోపాటు వాటికి ఆమోదం లభిస్తుంది. కేంద్ర పభుత్వ గుర్తింపు వివరాలను ఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌ డైరెక్టర్‌‌ శిఖా గోయల్‌‌ బుధవారం వెల్లడించారు. దేశంలోని అత్యుత్తమ ఫోరెన్సిక్‌‌ సైన్స్‌‌ లేబరేటరీలలో టీజీఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌కు మంచి గుర్తింపు ఉందని, డిజిటల్‌‌ ఫోరెన్సిక్‌లోనూ అత్యత్తమ ప్రమాణాలు పాటిస్తున్నదని పేర్కొన్నారు. డిజిటల్‌‌ ఫోరెన్సిక్‌‌ డివిజన్‌‌లో టీజీ ఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌ అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంతో పాటు మొబైల్‌‌ డివైజ్‌‌లు, హార్డ్‌‌ డ్రైవ్స్‌‌ (పాడైపోయిన మీడియా డివైజ్​లు) నుంచి కీలక ఆధారాలు సేకరిస్తున్నామని శిఖా గోయల్‌‌ తెలిపారు. ఎఫ్‌‌ఎస్‌‌లో డిజిటల్‌‌ స్టోరేజీకి సంబంధించి ప్రత్యేక వ్యవస్థ ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం టీజీఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌ నెలకు 50 కేసుల చొప్పున (కనీసం 150 మెటీరియల్‌‌ ఆబ్జెక్ట్‌‌లు) ఆధారాలు విశ్లేషించడంతో పాటు అత్యంత సున్నితమైన, సంచలన కేసుల్లోనూ సాక్ష్యాలను కోర్టుకు అందిస్తున్నామన్నారు. 

సుప్రీంకోర్టు నిబంధనలను అనుసరిస్తూ పోక్సో కేసుల్లో ఫోరెన్సిక్‌‌ నివేదికలను రూపొందించడంలోనూ రాష్ట్ర ఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌కు ప్రత్యేకత ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం టీజీఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌ను ఐటీ యాక్ట్‌‌ సెక్షన్‌‌ 79 కింద గుర్తించడం కీలక పరిణామంగా శిఖాగోయల్‌‌ పేర్కొన్నారు.