
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జెన్‌కోకు చెందిన తాడిచెర్ల-1 ఓపెన్‌కాస్ట్ కోల్ మైన్‌కు కేంద్ర కోల్ శాఖ నుంచి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. 'సేఫ్టీలో ఉత్తమ పద్ధతులు' కేటగిరీలో హైదరాబాద్ రీజియన్-1 డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీజీఎంఎస్) నుంచి మొదటి బహుమతిని, అలాగే 2023–-24 ఏడాదికి'5-స్టార్ రేటింగ్ అవార్డు'ను జెన్కో సాధించింది. గురువారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, సహాయ మంత్రి సతీశ్ చంద్ర దూబేల చేతుల మీదుగా జెన్కో ప్రతినిధులు ఈ అవార్డులను అందుకున్నారు.
జెన్కో తరఫున బి. నాగ్య (డైరెక్టర్, కోల్ & లాజిస్టిక్స్), సి. జీవ కుమార్ (చీఫ్ ఇంజనీర్, కోల్ & కమర్షియల్), పి. మోహన్ రావు (జనరల్ మేనేజర్, మైన్స్) ఈ కార్యక్రమంలో పాల్గొని అవార్డులను స్వీకరించారు. జెన్‌కో.. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు భద్రతా ప్రమాణాలను కఠినంగా పాటిస్తూ విద్యుత్ డిమాండ్‌ను సమర్థవంతంగా తీరుస్తోంది. ఈ సందర్భంగా జెన్‌కో సీఎండీ డాక్టర్ ఎస్. హరీశ్ అధికారులను అభినందిస్తూ, సురక్షిత మైనింగ్‌లో మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.