న్యూఢిల్లీ, వెలుగు: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ 2022 పోలీస్ మెడల్స్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1,082 మంది పోలీసులను వివిధ మెడల్స్‌కు ఎంపిక చేసింది. ఇందులో తెలంగాణకు మొత్తం 14 పత కాలు దక్కాయి. ఇద్దరికి పోలీస్ శాఖలో విశిష్ట సేవలకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ (ఏడీజీ), ఇంటెలిజెన్స్ ఎస్పీ దేవేందర్ సింగ్‌కు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్(పీపీఎం) లభించాయి. మరో 12 మందిని పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు (పీఎం) వరించాయి. ఏఆర్ శ్రీనివాస్ (ఐజీపీ), సత్యనారాయణ(ఏఎస్పీ), పైళ్ల శ్రీనివాస్ (ఏఎస్పీ), ఎస్.శ్రీనివాసరావు(ఏఎస్పీ), ఎస్వీ రమణమూర్తి (డీఎస్పీ), సి.వాసుదేవ రెడ్డి (డీఎస్పీ), గురురాఘవేంద్ర (డీఎస్పీ), రాజమౌళి (ఎస్ఐ), కె.శ్రీనివాస్ (ఏఎస్ఐ), నీలం రెడ్డి (ఏఆర్ఎస్ఐ), సుధాకర్ (ఏఆర్ఎస్ఐ), శ్రీనివాస్ (హెచ్ సీ) లకు పీఎం అవార్డులను హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది.
ఫైర్, జైళ్ల శాఖలో రెండేసి పతకాలు..
ఫైర్ సర్వీస్‌లో మొత్తం 55 మందికి కేంద్ర హోం శాఖ మెడల్స్ ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి లీడింగ్ ఫైర్ మెన్లు వెంకటేశ్వర్ రావు, ఫరీద్ షేక్‌కు ఫైర్ సర్వీసెస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీసెస్ పతకాలు దక్కాయి. జైళ్ల శాఖలో వీరస్వామి (చీఫ్ హెడ్‌వార్డర్), జోసెఫ్ (హెడ్ వార్డర్) లకు కరెక్షనల్ సర్వీస్ మెడల్ ఫర్ మెరి టోరియస్ సర్వీస్ లభించాయి. హోం గార్డు, సివిల్ డిఫెన్స్ లో అశోక్ రెడ్డి, సురేశ్, అబ్దుల్ షుకుర్లకు గ్యాలంట్రీ అవార్డులు వరించాయి.
