బీసీలకు సిటీ బయట.. వెలమలకు హైటెక్ సిటీలోనా?

బీసీలకు సిటీ బయట.. వెలమలకు హైటెక్ సిటీలోనా?

వెలమ, కమ్మ కమ్యూనిటీల భవనాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఐదెకరాల భూమిని కేటాయించింది. ఈ రెండు భవనాల కోసం ఎంతో డిమాండ్ ఉన్న హైటెక్ సిటీకి దగ్గరలో 5 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఆలిండియా వెలమ అసోసియేషన్‌కు 5 ఎకరాల భూమి, కమ్మ సమాఖ్యకు 5 ఎకరాల భూమి మంజూరుచేశారు. ఇందుకోసం ఖానామెట్ గ్రామంలోని సర్వే నెం. 41/14లో భూమి కేటాయించారు. ఈ భూమిని వెంటనే ఆయా కమ్యూనిటీల ప్రతినిధులకు అప్పగించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. 

కాగా.. వెలమ, కమ్మ కమ్యూనిటీ భవనాల కోసం ఎంతో విలువైన ప్రాంతంలో భూమి కేటాయించడం పట్ల రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 2018 ఎన్నికలకు ముందే బీసీ వర్గానికి చెందిన 23 కులాలకు కమ్యూనిటీ భవనాల కోసం ఎకరం చొప్పున కేటాయించింది. ఆ కమ్యూనిటీ భవనాల కోసం అవుటర్ రింగ్ రోడ్డు, కోకాపేట్ ప్రాంతాలలో భూకేటాయింపులు జరిగాయి. అయితే బీసీలకు సిటీకి దూరంగా భూములు కేటాయించి.. కమ్మ, వెలమలకు మాత్రం హైటెక్ సిటికి అరకిలోమీటర్ దూరంలో భూమి కేటాయించడంతో ఆయా కుల సంఘాల నుంచి విమర్శలు వస్తున్నాయి. బీసీలకు అవుటర్ రింగ్ రోడ్డులో కేటాయించడం.. కమ్మ, వెలమలకు హైటెక్ సిటీలో కేటాయించడమేంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా బీసీలపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని బీసీ నాయకులు మండిపడుతున్నారు.