సూర్యాపేట, వెలుగు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక కృషితో కోదాడ, హుజూర్‌నగర్ పట్టణాల్లో ప్రజా రవాణా వ్యవస్థ సరికొత్త రూపును సంతరించుకోనుంది. కోదాడలో అధునాతన బస్‌స్టేషన్ నిర్మాణానికి రూ.16.80 కోట్లు, హుజూర్‌నగర్ బస్‌స్టేషన్ పునరుద్ధరణ-ఆధునికీకరణకు రూ.3.50 కోట్లు కలిపి మొత్తం రూ.20.30 కోట్లతో రెండు ప్రధాన రవాణా కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు.
ఈ రెండు బస్‌స్టేషన్ల నిర్మాణ ప్రణాళికలు, ప్రయాణికులకు కల్పించాల్సిన వసతులు, పనుల పురోగతిపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కోదాడలో 5 ఎకరాల విస్తీర్ణంలో రెండు అంతస్తులతో పాటు విశాలమైన బస్ బేలు, ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు, ఎలక్ట్రిక్ బస్ ఛార్జింగ్ పాయింట్లు, వాణిజ్య సముదాయాలతో కూడిన టెర్మినల్‌ను, హుజూర్‌నగర్‌లో 2 ఎకరాల పరిధిలో రెండు అంతస్తుల టెర్మినల్‌ను ఆధునిక వసతులతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
