- గేటు ముందు కనిపించినా పంపేస్తున్న సెక్యూరిటీ
- ఇదేంటని అడిగితే, ప్రభుత్వం చెప్పిందే చేస్తున్నానన్న సీఎస్
సెక్రటేరియట్‌లోకి మీడియా ను రానివ్వట్లేదు. మీడియా సిబ్బంది వెళ్లకుండా గేటు వద్దే సెక్యూరిటీ గార్డులు అడ్డుకుంటున్నారు. గేటు ముందు కనిపించినా పంపించేస్తున్నారు. సచివాలయం తరలింపు పూర్తయ్యాక మీడియాను అనుమతిస్తామని గతంలో సీఎస్ ఎస్కే జోషి అన్నారు. ఇదే విషయాన్ని జర్నలిస్టులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మీడియాను లోపలికి అనుమతించొద్దని ప్రభుత్వమే చెప్పిందన్నారు. ‘‘మిమ్మల్ని ఆపడానికి నేనెవరిని? నేను కేవలం ప్రభుత్వ సర్వెంట్‌ను. మూడు నెలల్లో రిటైర్ అవుతా. ప్రభుత్వం చెప్పింది చేస్తున్నా” అని జోషి అన్నారు. మంత్రులే సచివాలయానికి రావట్లేదని, అలాంటప్పుడు మీడియా వచ్చి ఏం చేస్తుందని ప్రశ్నించారు. తమను అనుమతించాలంటూ సీఎస్‌కు జర్నలిస్టులు వినతిపత్రం ఇచ్చారు. తర్వాత సెక్రటేరియట్ గేటు ముందు కాసేపు నిరసనకు దిగారు.
మీ పిల్లలకు ఉద్యోగాలు గ్యారెంటీ
జీఏడీలోని ఓ కీలక అధికారిపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ‘‘అప్పుడప్పుడు బిల్డింగ్ ఊగినట్టు అనిపిస్తోంది. కొన్ని శాఖలను వేరే చోటుకు మార్చండి” అని ఉద్యోగులు ఆ పెద్ద సారుకు చెప్పారట. ఉద్యోగుల రిక్వెస్ట్‌కు ఆ అధికారి వ్యంగ్యంగా సమాధానమిచ్చారట. ‘‘బిల్డింగ్ ఊగుతోందా? అయితే, మంచిదే కదా. బిల్డింగ్‌కు ఏమైనా జరిగితే మీ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం గ్యారెంటీ” అని అన్నారట. సమస్య చెప్తే వెటకారంగా మాట్లాడడమేంటని ఉద్యోగులు మండిపడుతున్నారు. మహిళా ఉద్యోగులూ ఆయనపై కోపంగానే ఉన్నారు. చోటు లేదంటూ బతుకమ్మ వేడుకలు ఒక్క రోజే నిర్వహించడంపై మండిపడుతున్నారు. ఆ అధికారి 3 కార్లు వాడుతున్నారని, 10 మంది గ్రూప్ 4 ఉద్యోగులతో ఇంటి పనులు చేయించుకుంటున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఉద్యోగులకు పార్కింగ్ ప్రాబ్లమ్
సెక్రటేరియట్ ఉద్యోగుల బండ్ల పార్కింగ్ ప్లేస్‌ను ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్లకు మార్చారు. బండ్లు రోడ్డుపై ఎక్కువైపోవడంతో ఉన్నతాధికారులు వచ్చి పోవడానికి ఇబ్బంది కలుగుతోందంటూ సీఎస్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు పార్కింగ్ చేయకుండా రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. ‘నో పార్కింగ్’ ఫ్లెక్సీలు పెట్టారు. బండ్లు పార్క్ చేసి సెక్రటేరియట్ వరకు నడుచుకుంటూ రావడం ఇబ్బంది అవుతుందని ఉద్యోగులు అంటున్నారు.

