ఒక్క రోజు ఆలస్యమైనా ఊరుకునేది లేదు: SLBC పూర్తికి తెలంగాణ సర్కార్ డెడ్‌లైన్‌

ఒక్క రోజు ఆలస్యమైనా ఊరుకునేది లేదు: SLBC పూర్తికి తెలంగాణ సర్కార్ డెడ్‌లైన్‌

హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లా వరప్రదాయిని ఎస్ఎల్‎బీసీ ప్రాజెక్ట్ పూర్తికి తెలంగాణ ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. 2027 డిసెంబర్‌ 9లోగా ఎస్ఎల్‎బీసీ ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిందేనని కాంట్రాక్టర్‎కు గడువు విధించింది. ఎస్ఎల్‎బీసీ ప్రాజెక్ట్ పనుల పునరుద్ధరణపై గురువారం (సెప్టెంబర్ 4) సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఎల్‎బీసీ ప్రాజెక్ట్ తెలంగాణకు అత్యంత కీలకమని.. ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్‎బీసీ పనులు ఆలస్యం కావడానికి వీలులేదని ఆదేశించారు. కాంట్రాక్టర్‌ ఒక్క రోజు పనులు ఆలస్యం చేసినా ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్‌ వరకు ఉన్న సమస్యలపై తక్షణమే సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఎస్ఎల్‎బీసీకి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అటవీశాఖ అనుమతులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సొరంగం తవ్వకంలో సింగరేణి నిపుణుల సేవలు వాడుకోవాలని సూచించారు. సొరంగంలో నిరంతరం విద్యుత్ సరఫరా జరగాలని ఆదేశించారు.

కాగా, 2025 ఫిబ్రవరి 22న అమ్రాబాద్​మండలం దోమలపెంట వద్ద ఎస్ఎల్‎బీసీ  సొరంగం పనుల్లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంతో ఎస్ఎల్ బీసీ టన్నెల్ పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ టన్నెల్​పనులను పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.